జగన్ ఇస్తానన్న కోటి రూపాయల ఎక్కడ
అంతే జగన్ సర్కారు నిర్లక్ష్యంతోనే వరదలని వెల్లడి
వెలగపూడి ప్రతినిధి, ఆంధ్రప్రభ : బుడమేరు బాధితులకు వరద సాయంపై శాసనమండలిలో హోం మంత్రి వంగలపూడి అనిత వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటలు తూటాలు పేలాయి.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. ముందుగా మండలిలో విపక్షనేత బొత్స మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం.. నేనే అందుకు బాధ్యత తీసుకున్నానని అన్నారు. కానీ, ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైంది. ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని వెల్లడించారు బొత్స..
మీ కోటి రూపాయిలు ఎక్కడ…
బొత్స వ్యాఖ్యలకు హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటుగా సమాధానం ఇస్తూ అసలు మీ కోటి సాయంపై లెక్కలు చెప్పండంటూ నిలదీశారు.. కోటి ఎవరికిచ్చారు..ఎక్కడ పంచారు అంటూ బోత్సపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించారని ఆ డబ్బులు మా విపత్తుల శాఖకు ఇంత వరకూ అందలేదన్నారు.. వైసీపీకి చెందిన ఓ పత్రిక ఎలాఉందో సభలో వైసీపీ సభ్యులు అలానే ఉన్నారని ఎద్దేవా చేశారు.. ఎంతమందికి సాయం అందిందో ఆర్టీఐ యాక్ట్ లో పెడితే తెలుస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు సూచించారు. బుడమేరు వరద దురదృష్టకరం అన్నారు అనిత.. ఆక్రమణల కారణంగా బుడమేరు వరదలు వచ్చాయన్న ఆమె 2005 లో భారీ వరదలు విజయవాడను ముంచెత్తాయని గుర్తు చేశారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్ధ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచేందుకు 464 కోట్లతో గత తమ ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించామన్నారు.
జగన్ సర్కారు నిర్లక్ష్యంతోనే …
ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని అయితే మిగిలిన 20 శాతం పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. గత ప్రభుత్వం ఆ 20 శాతం పనులు పూర్తి చేయకపోవడం వల్లే మొన్నటి వరదల్లో విజయవాడ మునిగిపోయిందని ఆరోపించారు.. సీఎం 11 రోజులు బస్సులోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నారు.. మీకు అగ్గిపెట్టెలు.. కొవ్వొత్తులు బాధితులకు అందించాలనే ఆలోచన రావడం సంతోషమనంటూ బొత్సను ఎత్తిపొడిచారు. విజయవాడ వరద బాధితులను అన్నిరకాలుగా ఆదుకున్నామన్నారు. ఇంట్లో వస్తువులకు డబ్బులిచ్చాం. వాహనాలకు డబ్బులిచ్చాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు విడుదల చేశాం. వరద బాధితుల్లో ఎక్కడా అసంతృప్తి లేదన్నారు..ఈ రోజుకీ ఎవరైనా అర్హులైన బాధితులుంటే వారికి సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనిత ప్రకటించారు