AP | అమ్మ సంబరం ఆరంభం..

AP | అమ్మ సంబరం ఆరంభం..

  • వైభవంగా ప్రారంభమైన పెనుగంచిప్రోలు అమ్మవారి పెద్ద తిరునాళ్ల..
  • అఖండ జ్యోతి స్థాపన, హోమగుండ ప్రజ్వలనతో ఉత్సవాలకు శ్రీకారం…

AP | ఆంధ్రప్రభ పెనుగంచిప్రోలు : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో సోమవారం ఉదయం అమ్మవారి పెద్ద తిరునాళ్లకు ఘనంగా శ్రీకారం చుట్టారు. సంప్రదాయ పద్ధతిలో అఖండ జ్యోతి స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమై, భక్తిశ్రద్ధలతో హోమగుండ ప్రజ్వలన, ఇరుముడి కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో దేవస్థాన డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మహేశ్వర్ రెడ్డి, విద్యుత్ విభాగం ఇంజినీర్ రమ, ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

AP
  • ఇరుముడి సమర్పణకు భారీగా దీక్షా స్వాములు…

పెనుగంచిప్రోలు అమ్మవారి పెద్ద తిరునాళ్లలో భాగంగా ఇరుముడి సమర్పణ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దీక్షా స్వాములు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ వేషధారణతో, భక్తి భావంతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆలయానికి చేరుకున్న స్వాములు ఇరుముడులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, ప్రసాద పంపిణీ, క్యూలైన్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా చర్యలను కూడా పటిష్టం చేశారు. పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టింది. పెనుగంచిప్రోలు గ్రామం మొత్తం అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భజనలు, కీర్తనలు, హారతులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. అమ్మవారి పెద్ద తిరునాళ్ల సందర్భంగా రానున్న రోజుల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి కలగాలని భక్తులు ఆకాంక్షించారు.

Leave a Reply