AP | న్యూఢిల్లీలో ఏపీ భవన్‌లో సంక్రాంతి సంబరాలు..

AP | న్యూఢిల్లీలో ఏపీ భవన్‌లో సంక్రాంతి సంబరాలు..
- సంక్రాంతి వేడుకల్లో భాగంగా కనకదుర్గమ్మ దేవస్థానం ప్రత్యేక స్టాల్ ప్రారంభం..
AP | ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి వేళ ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు అందించాలనే ఉద్దేశంతో ఈ స్టాల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ స్టాల్ ద్వారా భక్తులకు శ్రీ కనకదుర్గమ్మ వారి ప్రసాదాలు, ఆలయ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలకు ఏపీ భవన్ ఉన్నతాధికారులు, సిబ్బంది, అలాగే పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం అధికారులు ఆకాంక్షించారు. దుర్గగుడి దేవస్థానం సూపర్నెంట్ జగదీష్ ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది అర్చకులు ఇక్కడ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
