AP | ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు

AP | ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
- జిల్లాలో జల్లికట్టు, కోడి పందేలపై కఠిన చర్యలు
- జిల్లా ఎస్పీ తుషార్ డూడి
AP | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీసు కుటుంబాలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి, తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటే ఈ పండుగ ప్రతి ఇంట్లో ఆనందం నింపాలని ఆకాంక్షించారు. సంప్రదాయ విలువలు కాపాడుతూ… ప్రజలంతా ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లాలో జల్లికట్టు, కోడి పందేలు, పేకాట, గుండాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూగజీవాలపై హింసకు దారితీసే ఇటువంటి కార్యక్రమాలకు జిల్లాలో ఎక్కడా అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
కోడి పందేలు, పేకాట వంటి జూద క్రీడల్లో పాల్గొంటే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, ప్రయాణ అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గతంలో నేరాలకు పాల్పడ్డవారిపై ఇప్పటికే నిఘా కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని వెల్లడించారు. కోడి పందేలు నివారించేందుకు రెవెన్యూ, జంతు సంక్షేమ శాఖ, ఇతర సంబంధిత విభాగాలతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఉప పోలీసు అధికారి, జంతు సంక్షేమ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో నిఘా కొనసాగించాలని తెలిపారు.
ఆటోలలో ధ్వని వాహినుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ స్థాయిలో సర్పంచులు, గ్రామ పెద్దలతో సమావేశాలు నిర్వహించి కోడి పందేల వల్ల కలిగే నష్టాలపై వివరించాలని చెప్పారు. అవసరమైన చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి, జల్లికట్టు లేదా కోడి పందేలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉప విభాగాధికారులను ఆదేశించారు.
కోడి పందేలు లేదా పేకాట నిర్వహించేందుకు తమ భూములు, స్థలాలు అందుబాటులో పెట్టిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జంతు హింస నిరోధక చట్టం, రాష్ట్ర గేమింగ్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వకూడదని హితవు పలికారు.
సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాను చట్టబద్ధతలో ముందుండేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
జిల్లాలో ఎక్కడైనా జల్లికట్టు, పేకాట, కోడి పందేలు జరుగుతున్నా లేదా జరగబోతున్నా వెంటనే అత్యవసర సహాయ సంఖ్య 112 లేదా జిల్లా పోలీసు వాట్సాప్ సంఖ్య 9440900005 కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
