వైసీపీ పాలనలో అభివృద్ధి అస్తవ్యస్తం…

వైసీపీ పాలనలో అభివృద్ధి అస్తవ్యస్తం…

చివరి రోజుల్లో వీధి పేర్ల రాజకీయాలు..
కార్పొరేషన్‌లో పెండింగ్ పనులపై ఒక్కసారిగా హడావుడి..
తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి..

విజయవాడ, పటమట : వైసీపీ పాలనలో గత ఐదు సంవత్సరాలుగా విజయవాడ నగరం అభివృద్ధి లేకుండా ఎంతో నష్టపోయిందని తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తీవ్ర విమర్శలు చేశారు. నగరంలోని ఆటో నగర్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ మేయర్ ఆధ్వర్యంలో నగరానికి ఉపయోగపడే ముఖ్యమైన అభివృద్ధి పనులు జరగలేదని ఆరోపించారు. కార్పొరేషన్‌లో ప్రతి నెల నిర్వహించాల్సిన కౌన్సిల్ సమావేశాలను సక్రమంగా నిర్వహించకుండా మూడు నాలుగు నెలలకు ఒకసారి నిర్వహించడం వల్ల అనేక పనులు పెండింగ్‌లో పడిపోయాయని పేర్కొన్నారు.

ఐదు సంవత్సరాలుగా ప్రజా సమస్యలను పట్టించుకోని వైసీపీ కార్పొరేటర్లు ఇప్పుడు ఒక్కసారిగా పెండింగ్ పనుల పేరుతో ఎజెండాలో ప్రతిపాదనలు పెట్టడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని విమర్శించారు. రాబోయే 11వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశం కోసం రూపొందించిన ఎజెండాను పరిశీలిస్తే నగర అభివృద్ధి అంశాల కంటే వీధుల పేర్లు పెట్టే ప్రతిపాదనలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నగర అభివృద్ధిపై చూపాల్సిన చిత్తశుద్ధి లేకపోయినా వీధి పేర్ల రాజకీయాలపై ఆసక్తి చూపడం వైసీపీ పాలన వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే విజయవాడ అభివృద్ధికి ఊతం లభించిందని బాలస్వామి తెలిపారు. సెంట్రల్, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కలిపి రూ.1041 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో నగరంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్ల పథకం, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, పెన్షన్ మొత్తాన్ని రూ.3000 నుంచి రూ.4000కు పెంపు వంటి నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని అన్నారు. వైసీపీ పాలనలో అవినీతి, దుర్వినియోగం పెరిగాయని ప్రజలు గ్రహించారని, అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని తీవ్రంగా తిరస్కరించారని చెప్పారు. రాష్ట్రంలో ఆ పార్టీ కేవలం కొద్ది స్థానాలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు అదే తీర్పును ఇవ్వబోతున్నారని బాలస్వామి అన్నారు.

విజయవాడ నగరంలో 64 కార్పొరేషన్ సీట్లలో వైసీపీకి కొన్ని సీట్లు కూడా దక్కని పరిస్థితి ఉందని, కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో కమిషన్ల కోసం తీసుకువచ్చిన ప్రతిపాదనలు, వీధి పేర్ల రాజకీయాలను టిడిపి కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా నిరంతరం పోరాటం కొనసాగించామని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధి కోసం తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, సుజనా చౌదరి, ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని)తో పాటు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Leave a Reply