AP | నిరాహార దీక్ష

AP | నిరాహార దీక్ష
- నిరుపేదల కడుపు కొట్టేందుకు బీజేపీ యత్నం
- ఉపాది హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును కొనసాగించాలి
- DCC అధ్యక్షులు KS షానవాజ్ డిమాండ్.
AP | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం ముమ్మాటికీ కుట్రేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షాన్ వాజ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మధుసూదన్ రెడ్డిలు మండిపడ్డారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టి ప్రస్తుతం దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే దానికి కారణం జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహోన్నతమైన యోధులే కారణమని వారు కొనియాడారు.
మహాత్మా గాంధీ గుర్తుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2006లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరిట నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని కరువు నుండి వారిని కాపాడాలని పథకాన్ని ప్రవేశపెట్టి 100 రోజుల పని దినాన్ని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.. దొడ్డిదారుల్లో అధికారంలో చెలామణి అవుతున్న బీజేపీ కూటమి జాతిపితను ఆగౌరవ పరిచేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 90 శాతం కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్ర ప్రభుత్వం వాటాల నిష్పత్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్ని ప్రారంభించగా ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని తెలిపారు.. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా 60శాతం మాత్రమే నిధులను కేంద్రం భరిస్తుందని 40శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టడం వల్ల పథకం మొత్తమే ప్రమాదంలో పడిందన్నారు.
ఇది దురుద్దేశపూర్వకంగా ప్రజలను వంచించడానికి పథకానికి పేరు మార్చి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమి పరిపాలన ఎన్నాళ్లు లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని వారు తెలిపారు.. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తూ జాతిపిత మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
బీజేపీ అప్రజాస్వమిక పరిపాలనతో దేశం నాశనం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగిస్తున్న కూడా కూటమిలో ఉన్న చంద్రబాబు మోడీని నీలదీయకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు కోట సత్యం, ధర్మవరం మాజీ ఇంచార్జ్ అశ్వర్థ నారాయణ, పీసీసీ సభ్యులు నిసార్, కాటమయ్య, గౌస్ భాష, భరణి, బాబు, బెల్లం నజీర్, చంద్రకాంత్, సురేంద్ర పీసీసీ సభ్యులు నిసార్, కాటమయ్య, అనిల్, అల్లబాకాష్, పరేష్, సమీఉల, కలీమ్, తాహిర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
