కెఎల్ యూ లో మాక్ పార్లమెంట్ పోటీలు..

కెఎల్ యూ లో మాక్ పార్లమెంట్ పోటీలు..

తరుణ్ కి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు..
వక్తృత్వం, నాయకత్వం, గణాంక ఆధారిత చర్చలతో జ్యూరీ ప్రశంసలు..

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ సమీపంలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లో నిర్వహించిన మాక్ పార్లమెంట్ పోటీల్లో బీజేపీకి చెందిన డాక్టర్ కాకాని తరుణ్ ఉత్తమ పార్లమెంటేరియన్’గా ఎంపికై జ్యూరీ ప్రశంసలు అందుకున్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఆయన చూపిన నాయకత్వ నైపుణ్యాలు, వక్తృత్వ శక్తి, విశ్లేషణాత్మక చర్చా తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చర్చల సందర్భంగా డాక్టర్ తరుణ్ కాకాని ఉపయోగించిన సాంకేతిక పరిభాష, సమగ్ర గణాంకాలు, ప్రస్తుత వ్యవహారాలపై విశ్లేషణ జ్యూరీని ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ వ్యవహారాలు, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక న్యాయం, చట్టపరమైన అంశాలపై ఆయన చేసిన వివరణలు పోటీలో పాల్గొన్న ఇతర ప్రతినిధులను కూడా ఆకట్టుకున్నాయి.

ప్రజెంటేషన్ శైలి, సమర్థమైన వాదన, శాస్త్రీయ దృక్పథంతో అంశాలను వివరించిన తీరు ఈ అవార్డుకు కారణమైందని నిర్వాహకులు తెలిపారు. ప్రజల సమస్యలను పార్లమెంటరీ చర్చల ద్వారా ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన యువ నాయకుడిగా ఆయనను జ్యూరీ అభినందించింది. డాక్టర్ తరుణ్ కాకాని ప్రస్తుతం న్యాయశాస్త్రంలో ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నారు. అదేవిధంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేబినెట్ మంత్రి కాకాని వెంకట రత్నం విలువలను సమాజానికి పరిచయం చేస్తూ, ఆ సిద్ధాంతాలను యువతకు అందించేందుకు డాక్టర్ తరుణ్ కాకాని కృషి చేస్తున్నారని ఆయన అనుచరులు తెలిపారు.

Leave a Reply