దుర్గగుడి తాత్కాలిక మూసివేత..

దుర్గగుడి తాత్కాలిక మూసివేత..
చంద్రగ్రహణ నేపథ్యంలో..
రేపు తెల్లవారుఝామున ఆలయ పునఃప్రారంభం..
ఆర్జిత సేవల వేళల్లో మార్పులు
నిర్మానుష్యంగా క్యూలైన్లు..
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై ఉన్న ఆలయంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఏర్పడుతున్న కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం దృష్ట్యా అమ్మవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పాక్షిక చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని వైదిక కమిటీ సూచనలతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ఆగమ శాస్త్ర ప్రకారం మంగళవారం ఉదయం 10:00 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాల కవాటాలను మూసివేశారు. గ్రహణ మోక్షకాలం అనంతరం బుధవారం తెల్లవారు ఝామున 3 గంటలకు ఆలయ కవాటాలను తిరిగి తెరిచి దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించనున్నారు.

తదనంతరం అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలు పూర్తి చేసి ఉదయం 8 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్నపనాభిషేకం ఇతర శుద్ధి కార్యక్రమాల నేపథ్యంలో తెల్లవారుఝామున నిర్వహించే ఆర్జిత సేవలు సుప్రభాతం, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమయ్యే సేవలను ఉదయం 8:30 గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్, ప్రత్యేక ఆహ్వానితులు వి శంకర బాబు తదితరులు పాల్గొన్నారు.
