AP | రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

AP | రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా రైతు బజార్లకు మోపిదేవి మండల టమాటా
AP | మోపిదేవి – ఆంధ్రప్రభ : టమాటా రైతుల సమస్యను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిష్కరించారు. ఈ రోజు మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామ సర్పంచ్ కోసూరు అనూష, గ్రామ ప్రముఖులు కోసూరు శివ నాగమల్లేశ్వరరావు అవనిగడ్డలో ఎమ్మెల్యేను కలిసి టమాటా రైతు సమస్యను వివరించారు. ప్రస్తుతం మోపిదేవి మండలం కోసూరువారిపాలెం, నాగాయతిప్ప, ఉత్తర చిరువోలులంక, బొబ్బర్లంక గ్రామాల్లో రోజుకు రెండు వేల బాక్సుల టమాటా ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. వీటిలో చల్లపల్లి, మచిలీపట్టణం రైతు బజార్ల డిమాండ్ 500 బాక్సులు మాత్రమేనని తెలిపారు.
రాబోయే వారం రోజుల్లో ఈ నాలుగు గ్రామాల నుంచి వచ్చే టమాటా దిగుబడి ఐదు వేల బాక్సులకు పెరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో టమాటా రైతులు ఎదుర్కోబోయే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టరుకు ఫోన్ చేసి, ఇక్కడి టమాటా స్థాకును ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని రైతు బజార్లలో విక్రయాలు జరిగేలా రైతులకు సహకరించాలని సూచించారు. వెంటనే అంగీకరించిన ఏడీఎం మోపిదేవి మండల టమాటా స్టాకును ఎన్టీఆర్ జిల్లా రైతు బజార్లలో విక్రయించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. టమాటా రైతుల సమస్యకు తక్షణ పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకు సర్పంచ్ అనూష, శివనాగమల్లేశ్వరరావు ధన్యవాదములు తెలిపారు.
