SLBC సొరంగం నుంచి మరో మృతదేహం వెలికితీత

అమ్రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్‌లో నెల రోజుల కింద‌ట ప్రారంభించిన రెస్క్యూ ఆప‌రేష‌న్ పురోగ‌తి సాధించింది. మంగ‌ళ‌వారం ఉద‌యం రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు వెళ్లిన సిబ్బందికి మృత‌దేహం ఆన‌వాళ్లు క‌నిపించాయి. అయితే ఆ మృత‌దేహాన్ని వెలికి తీసి మధ్యాహ్నం ఒంటి గంట‌కు బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చారు. మృతుడి ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన మ‌నోజ్ కుమార్‌గా గుర్తించారు. టెన్న‌ల్‌లో ఏఈగా డ్యూటీ చేస్తూ ప్ర‌మాదంలో చిక్కుకున్నారు.

మృత‌దేహం గుర్తించిందిలా…
సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ బృందానికి టీబిఎం శిథిలాల కింద దుర్వాసన రావడంతో తవ్వకాలు చేపట్టారు. మినీ హిటాచి తో తవ్వకాలు చేపడుతుండగా ఆనవాళ్లు గుర్తించారు. దీంతో లోకో ట్రైన్‌లో అధికారులు లోప‌ల‌కు వెళ్లారు. పూర్తి స్థాయిలో త‌వ్వ‌కాలు చేప‌ట్టాల‌ని సూచించారు. టీబీఎం శిథిలాలను గ్యాస్ కట్టర్లతో తొలగించి దుర్వాసన రావడంతో స్ప్రే బాటిల్స్ ద్వారా ఉపశమనం పొందుతూ సహాయక చర్యలు కొనసాగించారు. ట‌న్నెల్‌లో ఫ్రంట్ లైన్ నుంచి 30 మీటర్ల దూరంలో గుర్తించారు. శ‌వ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పురోగ‌తి సాధించిన రెస్క్యూ
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లోని నెల‌రోజులుగా చేప‌ట్టిన‌ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగ‌తి క‌నిపించింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామ సమీపంలోని ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ఫిబ్రవరి 22న జరిగిన 14 కిలోమీటర్ వద్ద చోటుచేసుకున్న ప్రమాద ఘటనలో ఎనిమిది మంది ఆచూకీ తెలియ‌రాలేదు. ఈ క్రమంలో రెస్క్యూ ఆప‌రేష‌న్ చేయ‌గా, ఈ నెల 9న టీబీఎం ఆప‌రేట‌ర్ గురుప్రీత్‌సింగ్ మృత‌దేహం ల‌భించింది. ఆ త‌ర్వాత మిగిలిన ఏడు గురు ఆచూకీ కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంతంగా చేప‌ట్టారు. 32వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ టన్నెల్ లో మరో మృతదేహం ఉన్న‌ట్లు సిబ్బంది గుర్తించారు. కన్వేయర్ బెల్ట్ కి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది మరో మృతదేహాన్ని గుర్తించారు. హిటాచీతో మట్టి, నీరు తవ్వుతుండగా డెడ్ బాడీ కనిపించింది. మృతదేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ప్ర‌త్యేక అధికారి ఆధ్వ‌ర్యంలో రెస్క్యూ ఆప‌రేష‌న్
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఐఏఎస్ అధికారి శివ‌శంక‌ర్ లోతేటిను ప్ర‌త్యేకాధికారిగా సీఎస్ శాంత‌కుమారి నియ‌మంచారు. శివ‌శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో 32 వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో దాదాపు 25 బృందాలుగా 700 మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. టన్నెల్ లో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఆరుగురి కోసం స‌హాయ‌క‌ చర్యలు కొనసాగుతున్నాయి.

త్వరలో రెండు మృతదేహాలు గుర్తించే అవకాశం
టన్నెల్ లో నెల 9వ తేదీన గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం కావడం తో రిస్క్ బృందాలు పురోగతిని సాధించాయి. 32 రోజుల అనంతరం మరో మృతదేహం లభించింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న ప్రదేశం లోనే మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో త‌వ్వ‌కాలు చేప‌ట్టి బ‌య‌ట‌కు తీసుకొచ్చే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *