చిత్రకళతో జీవన ధన్యతను పొందుతున్న అంజి..

అమలాపురం : అపురూపమైన చిత్ర కళా యజ్ఞాన్ని నిరంతరాయంగా, నిస్వార్ధంగా చేస్తున్న ప్రముఖ చిత్రకారుడు ఆకొండి అంజి జీవనం కళాత్మకంగా ధన్యమైందని ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వసంపాదకులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు.

శనివారం సాయంకాలం హైదరాబాద్ జ్ఞానమహాయజ్ఞకేంద్రం కార్యాలయంలో అంజి ఆకొండి అపూర్వ సంకల్పమైన ప్రాచీన కళల పునర్వైభవం చిత్రకళాపోటీల జాతీయ స్థాయి పోటీల బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ… సౌందర్యం, సంఘజీవనం, సామాజిక సమస్యలు, ఆధ్యాత్మిక దృష్టి , కళాత్మక వైభవం … ఇవన్నీ అంజి కుంచెలో జాలువారడమే కాకుండా ప్రతిభ ఉన్న యువతరాన్ని ప్రోత్సహించడంలో అంజి చేసే నిస్వార్ధ సేవను అందరూ గుర్తించి ప్రోత్సహించాలని చెప్పారు.

నాగరికత పెరిగి డిజిటల్, గ్రాఫిక్స్ పెరిగిన ఈరోజుల్లో చిత్రకళను పిచ్చిగా ప్రేమించే మంచి సహృదయమున్న కళాకారుడు అంజిలోని వినయసంపన్నత ఎందరో కళాకారులకు ఆదర్శప్రాయమని పురాణపండ చెప్పారు. ఈ సందర్భంగా ఆకొండి అంజి మాట్లాడుతూ తమ క్రియేటివ్ హార్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో త్వరలో జాతీయ స్థాయిలో ప్రాచీన కళలైన తోలుబొమ్మలాట , హరికథ, బుర్రకథ వంటి కళల పునర్వైభవంకోసం పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply