ప్రాణాలతో ఇసుకలో పాతిన మృగాలు
- కుక్కలు సైతం కుక్కత్వం ప్రదర్శన
- కాపాడిన పారిశుధ్య కార్మికుల్లో మానవత్వం
- ప్రస్తుతం తిరుపతి రుయాలో శిశువు
(ఆంధ్రప్రభ, వరదయ్యపాలెం / తిరుపతి ప్రతినిధి) : అప్పుడు భూగర్భంలో భూమిజ ఉదయించింది. అదే మన రాములోరి సతీమణి సీతమ్మ, ఈరోజు సైకత సమాధిలో.. బొడ్డూడిన సైకిజ దొరికింది. పది నెలలు మోసిన తల్లికి తెలుసో లేదో.. కొన్ని గంటల కిందట భూమ్మీద పడి కళ్లు తెరవని ఈ శిశువును పీకలోతు ఇసుకలో పాతిన దుర్మార్గులెవరో కానీ మానవతం లేని దానవులే. శవం దొరికిందని ఆశతో వచ్చిన కుక్కలు సైతం.. ఆ శిశువు ఆక్రందనలతో పారిపోయి తమ కుక్కత్వాన్ని ప్రదర్శించాయి.

కడకు తెల్లవారుజామున చెత్తను ఊడ్చే పారిశుధ్య కార్మికులు ఈ దృశ్యంతో అవాక్కయ్యారు. అల్లాడిపోయారు. చలించి ఆ శిశువును ఇసుక నుంచి తీశారు. 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే కుక్కలు కరిచిన గాయాలతో సొమ్మసిల్లిన శిశువును వరయపాలెం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ఈ బిడ్డ పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తికి తరలించారు. అక్కడ సదుపాయాలు లేవని సూళ్లూరుపేటకు రిఫర్ చేశారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించేందుకు ప్రయత్నించారు.

ఇక బిడ్డను కాపాడడానికి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాలని నర్సు కోరారు. ఎట్టకేలకు అజ్ఙాత సైకిజ ప్రాణాలు దక్కుతాయో లేదో.. కానీ.. ఈ హృదయ విదారక ఘటనతో సభ్య సమాజం కన్నీళ్లు పెడుతోంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల కేంద్రంలోని బస్టాండు సమీపంలో ఓ మెడికల్ షాపు దగ్గర గుర్తు తెలియని వక్తులు అప్పుడే అమ్మ గర్భం నుంచి బయట పడిన పురిటి పసికందును రోడ్డు పక్కన ఇసుకలో పూడ్చి వదిలేశారు. ఈ దారుణ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగిందో.. సోమవారం తెల్లవారు జామున జరిగిందో. సోమవారం తెల్లవారుజామున ఊరిలో చెత్తను ఊడ్చే పారిశుధ్య కార్మికులు గుర్తించి, పోలీసులకి సమాచారం అందించారు.



