Andhraprabha Effect : అధిక ధరలకు అడ్డుకట్ట

Andhraprabha Effect : అధిక ధరలకు అడ్డుకట్ట

కొబ్బరికాయల అధిక ధరలపై ఆలయ అధికారుల కఠిన చర్యలు


యాదగిరికొండ / ఆంధ్రప్రభ : శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయ (Yadagirigutta temple) ప్రాంగణంలో భక్తులకు కొబ్బరికాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఆలయ ఉన్నతాధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. భక్తుల ఆర్థిక దోపిడీని అరికట్టడానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆలయ అధికారులు, కొబ్బరికాయలు విక్రయించే స్టాళ్ళ వద్దకు స్వయంగా వెళ్ళి పరిశీలించారు.

ఈ సందర్భంగా స్టాల్ నిర్వాహకులతో మాట్లాడిన అధికారులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కొబ్బరికాయను కేవలం రూ.40 (నలభై రూపాయలకు) మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు.

నిర్ణీత ధర (Fixed price) కంటే అధికంగా విక్రయించిన పక్షంలో, లేదా నిబంధనలకు భిన్నంగా వ్యవహరించిన ఎడల, సంబంధిత కొబ్బరికాయల టెండర్‌ను తక్షణమే రద్దుచేస్తామ‌ని ఆలయ అధికారులు కఠినంగా హెచ్చరించారు. భక్తులకు ధర విషయంలో పూర్తి స్పష్టతనిచ్చేందుకు, ప్రతి స్టాల్ వద్ద ‘ఒక కొబ్బరికాయ ధర రూ.40లు మాత్రమే’ అనే స్టిక్కర్లను ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు.

భక్తులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంలో ఆలయ పాలకమండలి కట్టుబడి ఉందని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ నిబంధనలను సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కోరారు.

Leave a Reply