MINISTER RAVINDRA : సహజ వనరులకు ఢోకా లేదు Andhra Prabha News

MINISTER RAVINDRA : సహజ వనరులకు ఢోకా లేదు Andhra Prabha News
- యువతకు ఉపాధే లక్ష్యం
- బీచ్ సాండ్ ఖనిజాలతో
- పారిశ్రామిక ప్రగతికి పునాది
- ఏపీ ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్ కారిడార్’
- అభివృద్ధి దిశగా అడుగులు
- ఖనిజాల వెలికితీత హబ్‌గా ఏపీ రూపాంతరం
- దేశానికే వ్యూహాత్మక ఖనిజాల నిలయంగా ఏపీ
- రేర్ ఎర్త్ మినరల్స్ వర్క్ షాపులో మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర
( ఆంధ్రప్రభ. ఎన్టీఆర్ బ్యూరో )

ఏపీలో సహజ వనరులను వెలికితీసి యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు..నోవాటెల్ హోటల్ లో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీచ్ సాండ్ ఖనిజాల నుంచి టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ , శాశ్వత అయస్కాంతాలు – ఆంధ్రప్రదేశ్‌లో దేశీయ విలువ పెంపు గొలుసుల నిర్మాణం: అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ లో రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ…. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ‘బీచ్ సాండ్ మినరల్స్’ కీలకమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం దేశానికే వ్యూహాత్మక ఖనిజాల నిలయమనన్నారు..

రాష్ట్రాన్ని ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్ కారిడార్’గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతోందన్నారు. ఖనిజాల వెలికితీత నుండి తయారీ హబ్‌గా ఏపీ రూపాంతరం చెంది ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ దిశగా అడుగులు వేస్తుందన్నారు.. శ్రీకాకుళం నుండి మచిలీపట్నం వరకు విస్తరించి ఉన్న విస్తారమైన తీరప్రాంతం ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉందన్నారు. ముఖ్యంగా బీచ్ సాండ్ ఖనిజాలు కేవలం ఆదాయ వనరులు మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV), ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు వ్యూహాత్మక వనరులుగా మారాయని పేర్కొన్నారు. తన నియోజకవర్గం మచిలీపట్నంలో కూడా ఈ ఖనిజ నిక్షేపాలు గణనీయంగా ఉన్నాయని వెల్లడించారు.

గతంలో గనుల రంగం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పారదర్శకతను పునరుద్ధరించి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. మైనింగ్‌ను కేవలం ఆదాయ వనరుగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని నడిపించే ఇంజన్‌గా ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఖనిజ బ్లాకుల వేలాలను వేగవంతం చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టడం, సాంకేతికత ఆధారంగా పారదర్శకత పెంపు వంటి చర్యలు చేపట్టామన్నారు.

ఇటీవలి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం దేశపు పెట్టుబడులలో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్రంపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమన్నారు. వాల్యూ చైన్ అభివృద్ధి, తయారీ హబ్‌గా ఏపీ కేవలం ఖనిజాల వెలికితీత (Extraction) కే పరిమితం కాకుండా, ప్రాసెసింగ్, తుది ఉత్పత్తుల తయారీ వరకు పూర్తి స్థాయి విలువ ఆధారిత వ్యవస్థను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సహజ వనరులను వినియోగించి పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా మైనింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 16,600 హెక్టార్లలో విస్తరించి ఉన్న 16 రకాల ఖనిజ నిక్షేపాలను గుర్తించామని, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాన్ని ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్ కారిడార్’ అభివృద్ధి కోసం గుర్తించడం గర్వకారణమన్నారు. రాష్ట్ర మైనింగ్, తయారీ రంగాలను బలోపేతం చేసి సంస్కరణలకు ప్రోత్సాహం అందిస్తున్న గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. బాధ్యతాయుతమైన మైనింగ్, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల స్థాపన వంటి అంశాలను సమగ్రంగా కలుపుకుని పూర్తి స్థాయి పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో మైనింగ్ హబ్‌గా నిలబెట్టగలమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

ప్రత్యేక అతిథి మాజీ డీఆర్డీఓ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు డా. జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా టైటానియం, రేర్ ఎర్త్ మాగ్నెట్లకు భారీ డిమాండ్ పెరుగుతోందన్నారు. రక్షణ, అంతరిక్ష, క్షిపణి సాంకేతికత, అధునాతన ఇంజినీరింగ్ రంగాల్లో ఈ పదార్థాల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని వివరించారు. స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా దిగుమతులపై ఆధారపడకుండ దేశం ముందుకు సాగగలదన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా లభించే బీచ్ సాండ్ ఖనిజాలను సాంకేతిక పరిజ్ఞానంతో విలువ పెంచితే అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడే స్థాయికి చేరుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని సతీష్ రెడ్డి అన్నారు.

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (గనులు) ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. దీర్ఘకాలిక ఖనిజ సరఫరా భద్రతతో పాటు పరిశ్రమలకు అనుకూల విధాన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా వేగవంతమైన అనుమతులు, పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బీచ్ సాండ్ ఖనిజాల వినియోగంలో పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక విధాన స్థిరత్వం, స్పష్టమైన మార్గదర్శకాలు అందుబాటులో ఉంటాయని ముఖేష్ కుమార్ మీనా భరోసా ఇచ్చారు.

ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కార్యదర్శి యువరాజ్ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక పార్కులు, పోర్ట్ కనెక్టివిటీ వంటి అంశాలు ఆంధ్ర ప్రదేశ్ కు ఉన్న బలాలని చెప్పారు. వేగవంతమైన నిర్ణయాలతో పరిశ్రమలు త్వరగా స్థాపన దశకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశ్రమల వాతావరణాన్ని రాష్ట్రంలో ఏర్పరచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలను ఈ రంగంలోకి ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

ఏపీఎండీసీ వైస్ చైర్మన్, ఎండీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గుర్తించిన బీచ్ సాండ్ ఖనిజ నిల్వలు పరిశ్రమలకు దీర్ఘకాలిక ముడి సరుకు భద్రతను అందిస్తాయని తెలిపారు. శాస్త్రీయ తవ్వకాలు, సమర్థవంతమైన ఖనిజ ఉత్పత్తులను వేరు చేసే యూనిట్లు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ముడి ఖనిజాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వరకు ఏపీఎండీసీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. పరిశ్రమలతో భాగస్వామ్యాల ద్వారా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
కేంద్ర క్రిటికల్ మినరల్స్ మిషన్ డైరెక్టర్ అనీష్ పాండే వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ... వ్యూహాత్మక ఖనిజాల కోసం ₹7,280 కోట్ల కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు. ప్రస్తుతం ఐఆర్ఈఎల్ మాత్రమే ప్రధాన సరఫరాదారుగా ఉందని, అయితే డిమాండ్‌కు అనుగుణంగా ఏపీఎండీసీ వంటి మరిన్ని సంస్థలు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం గ్రాఫైట్, టైటానియం, జిర్కోనియం వంటి ఖనిజాల ఉత్పత్తి జరుగుతోందని, రాబోయే సంవత్సరాల్లో లిథియం డిమాండ్ 6 నుండి 8 రెట్లు, కోబాల్ట్ డిమాండ్ 3నుండి 5 రెట్లు పెరుగుతుందని అంచనా ఉందన్నారు. ఎంఎండీఆర్ చట్ట సవరణ ద్వారా భారతీయ కంపెనీలు విదేశాలలో కూడా ఖనిజ అన్వేషణ చేసేందుకు మార్గం సుగమమైందన్నారు. దీనిలో భాగంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియాతో ఇందుకోసం ఒప్పందాలు జరిగాయన్నారు. అక్టోబర్ 2025లో ₹1,500 కోట్లతో రీసైక్లింగ్ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించామని, దీని ద్వారా ఏడాదికి 2.7 లక్షల టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్‌కు అవసరమైన యంత్రాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేశామన్నారు. జీఎస్ఐ, ఇతర సంస్థల ద్వారా ఇప్పటికే 1,000 మందికి పైగా శిక్షణ ఇచ్చామన్నారు. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డబ్లూ.బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఖనిజ అన్వేషణ విస్తరణతో పాటు సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. బాధ్యతాయుత తవ్వకాలతో పాటు పారదర్శకతను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు.
