ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. స్పందించిన రైల్వే శాఖ !!

బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ) : చారిత్రక వైభవాన్ని కలిగిన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ దుస్థితిపై ఆంధ్రప్రభ ప్రచురించిన ప్రత్యేక కథనం విస్తృత చర్చకు దారి తీసింది. నత్తనడకన సాగుతున్న ప్లాట్‌ఫారమ్ విస్తరణ పనులు, లిఫ్టులు–ఎస్కలేటర్లు లేకపోవడం, ఒకే ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై ఆధారపడాల్సి రావడం, ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్–సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగకపోవడం వంటి సమస్యలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆ కథనంలో వివరించింది.

ఈ నేపథ్యంలో బెల్లంపల్లికి చెందిన ఓ యువకుడు స్టేషన్ సమస్యలను ట్విట్టర్ ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లాడు. ప్రయాణికుల ఇబ్బందులు, పూర్తికాని ప్లాట్‌ఫారమ్ పనులు, అవసరమైన వసతుల కొరతను వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు.

యువకుడి ట్వీట్‌ను గమనించిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వెంటనే స్పందించింది. ఈ ట్వీట్‌ను సికింద్రాబాద్ రైల్వే డివిజన్ డీఆర్ఎంకు ఫార్వర్డ్ చేస్తూ, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం సికింద్రాబాద్ డీఆర్ఎం సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రభ కథనం వెలువడటం, అనంతరం యువకుడి సోషల్ మీడియా స్పందనతో ఈ అంశం పై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకృతమైంది. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఇకపై వేగవంతం అవుతాయన్న నమ్మకం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ స్టేషన్‌ తిరిగి పూర్వ వైభవం పొందేందుకు అవసరమైన అన్ని వసతులను వెంటనే అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply