అందేశ్రీ ఇక లేరు

  • సామాన్యుడి నుండి జనాన్ని చైతన్య పరుస్తూ కవిగా, గాయకుడిగా ఎదిగిన వైనం
  • అత్యంత సరళమైన గీతమాలికలతో జనాన్ని ఆలోచింపజేసిన మేధావి
  • జ‌న‌చైతన్య గీతికలతో మార్గదర్శిగా నిల్చిన గొంతుక
  • అందే శ్రీ కృషికి దక్కిన పురస్కారాలు – అవార్డులు ఎన్నో

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : అందే శ్రీ.. ఈ పేరు చెప్పగానే తెలంగాణ ఏర్పడక ముందుకు అందరి నోళ్లలో వినిపించిన గేయం.. జయజయహే తెలంగాణ(Jaya Jaya Telangana) జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకల ఒక్కటైన కేతనం.. అంటూ ఏ ఉద్యమ స్థానం చూసినా వినిపించేది.. తెలంగాణ సాధన కోసం నిరవధిక దీక్ష కేంద్రాల్లో ఉదయమే మైకుల ద్వారా ఈ పాట వినిపించేది. ఎందరో తెలంగాణ యువత ఈ పాటను స్పూర్తిగా తీసుకుని తెలంగాణ సాధన కోసం రోడ్లెక్కేవారు.. అంతలా అందే శ్రీ రచించిన గేయం అందరూ హృదయాలను తట్టి లేపింది..

ఇక మాయమైపోతున్నడమ్మా(is it disappearing?).. మనిషన్న వాడు… మచ్చుకైనా కానరాడు.. అంటూ ఆలపించిన అందే శ్రీ(Ande Sri) గేయం.. నేటి రోజుల్లో మనిషి ఎలా ఉండాలో, సాటి మనిషితో ఎలా నడుచుకోవాలో ఈ గీతం చెబుతుంది.. ఇలా అనేక సామాజిక కోణాలను తట్టి లేపి ఎంతో సహజసిద్ధంగా ఉండే అక్షరాల మాలను పాటల పూదోటలుగా మలచి అందించిన అందే శ్రీ గళం మూగబోయింది.. 961 జూలై 18న సిద్దిపేట జిల్లా(Siddipet district) రేబర్తిలో జన్మించిన అందెశ్రీ ఇక లేరు అన్న వార్త‌ను తెలంగాణ‌వాసులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

తెలంగాణ సమాజానికి పరిచయం అక్కర్లేని గొంతుక అందే శ్రీ ది.. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961లో తల్లిదండ్రులకు జన్మించారు.. చదువు పెద్దగా అబ్బకపోయినా సరస్వతీ దేవి ఆయన్ను కటాక్షించింది.. ఆయన గొంతు నుండి జాలువారిన గేయాలు తెలంగాణ సమాజాన్ని తట్టులేపాయి. కొన్ని సినిమాలకు గేయ రచయితగా పనిచేశారు. బతుకమ్మ సినిమా(Bathukamma Movie)కు మాటలు( సినీ సంభాషణను) అందించారు.. ఇక అందే శ్రీ ని ఎన్నో పురస్కారాలు, అవార్డులు వరించాయి..

ఈ ఏడాది జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర గీతిక రచించిన సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.కోటి నగదు పురస్కారాన్ని ప్ర‌దానం చేశారు. జులై 18న ఉన్నట్టుండి అందే శ్రీ కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ గాంధీలో చికిత్స నిమిత్తం చేర్పించారు.. చికిత్స పొందుతూ అందెశ్రీ (64) సోమవారం ఉదయం 7: 15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు..

డా. అందెశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో గుండయ్య – ఎల్లమ్మ దంపతులకు 1961 లో జన్మించారు.. అందే శ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. అందే శ్రీ మొత్తం సంతానంలో చివరి వాడు. అందే శ్రీ కి ఓ సోదరుడు, సోదరి ఉన్నారు.. కాగా అందెశ్రీకి నలుగురు సంతానం కాగా ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందే శ్రీ బాల్యంలో గొర్ల కాపరిగా, మోట కొట్టేవాడిగా జీవనం సాగించారు. 14 ఏళ్ల వయస్సులో భవన నిర్మాణ కార్మికుడిగా(as a construction worker) మరో ప్రస్థానాన్ని కొనసాగించాడు.

అందే శ్రీ కి చిన్నతనంలో చదువు అబ్బకపోయినా ఆయనకు సరస్వతీ కటాక్షం జరిగింది. ఫలితంగా ప్రజా కవిగా, సినీ గేయ రచయితగా, ఉద్యమ కారుడిగా ప్రస్థానాన్ని సాగించాడు. తన అరుదైన గళంతో ప్రజాకవిగా, సీనీ రచయితగా మలి దశ ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రసిద్ధి గాంచాడు.

అందే శ్రీ ప్రముఖ ప్రజా కవిగా పేరుపొందారు. అందే శ్రీ చిన్నతనంలో గొర్ల కాపరిగా జీవనం సాగించారు. ఈ క్రమంలో జీవాలను సాధే క్రమంలో అలవాటుగా పాడిన పాటలు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయన విలక్షణమైన గొంతుక ఎన్నో పాటలను రచించే స్థాయికి చేర్చింది. శృంగేరి మఠానికి(Sringeri Math) సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందే శ్రీ విలక్షణమైన గొంతును విని అబ్బుర్పపడ్డారు.

సినీ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఆర్ .నారాయణ మూర్తి నిర్మించి దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో అందే శ్రీ రచించిన గేయాలు ఉన్నాయి.. నారాయణ మూర్తి నిర్మించిన ఊరుమనదిరా లోని దళిత పులులు , ఎర్ర సముద్రం సినిమా(Erra Samudhar Cinema)లో మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు.. జై బోలో తెలంగాణలో చూడు తెలంగాణ.. చుక్క నీరు లేని దాన, తెలంగాణ రాష్ట్ర సాధనలో జనాన్ని ఉర్రూతలూగించి జన చైతన్యాన్ని రగిలించి ఉద్యమం వైపు సాగేలా చేశాయి..

జయజయహే తెలంగాణ.. జననీ జయ కేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.. అంటూ సాగిన గీతం ఇప్పటికీ ఒక సంచలనమే.. ఇప్పుడు ఇదే గేయం రాష్ట్ర ప్రభుత్వంచే రాష్ట్ర గేయంగా గుర్తించబడి తెలంగాణ సమాజం ఆలపించబడుతుంది..

విప్లవాత్మక సినిమా విజయాల వెనుక అందే శ్రీ చేసిన కృషి ఎంత ఉందో తెలంగాణ పోరాటం కోసం ఆయన పాటుపడిన కృషి అంతే ఉందని చెప్పవచ్చు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు హైదరాబాద్, కళాశాలలు, వేదికలు, జర్నలిస్టు సంఘాల సభల్లో ఆయన ప్రసంగం, పాటలు ఎంతో ప్రేరణ ఇచ్చాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం(Telangana Dhoom dham) కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ లోని ప‌ది జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు.

అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకలతో ఇప్పటికి విద్యాసంస్థలలో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా, ప్రార్థనాగీతంగా పాడుకోవడం విశేషం. అయితే తెలంగాణ ఉద్యమ సారధి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందెశ్రీ ని ఎంతో ఇష్టపడేవారు.

ఏమైందో ఏమో కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కనీసం కేసీఆర్ ను వ్యక్తి గతంగా కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని అందే శ్రీ బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక పలు మార్లు సీఎం రేవంత్ రెడ్డి పలు వేదికలపై అందే శ్రీ ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. అంతేకాక ఈ సంవత్సరం జూన్ 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రేవంత్ చేతుల మీదుగా అందే శ్రీ కోటి రూపాయల నజరానా అందుకున్నారు.

అందే శ్రీ ప్రజా కవిగా, గేయ రచయితగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందే శ్రీ పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ నేపద్యం, వెనుకబాటు తనం, మనిషి నైజం, ప్రకృతి లాంటి అంశాలపై ఆయన గేయ రచన సరళమైన పద్ధతిలో సాగింది.. ఎంతో సహజత్వంతో సాగిపోయే అక్షరాలను పాటల మాలగా మలచి అందించిన అందే శ్రీ తన పాటలను సమాజానికి అందించారు.

అందే శ్రీ అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు(Ganga Cinema in 2006) గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన తెలంగాణ మాతృగీతం రచించారు. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం తెలంగాణ అధికారిక గీతంగా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడింది..

రాసిన గేయాలు..

1) పల్లెనీకు వందనములమ్మో..
2) మాయమై పోతున్నడమ్మో మనిషన్నవాడు
3) గలగల గజ్జెలబండి
4) కొమ్మ చెక్కితే బొమ్మరా…
5) జన జాతరలో మన గీతం
6) యెల్లిపోతున్నావా తల్లి చూడ చక్కని
ఆవారాగాడు (సినిమా) ఇలా పలు సినిమాలకు ఆయన గేయ రచయితగా పనిచేశాడు. ఇక సినీ సంభాషణ కర్తగా కూడా అందే శ్రీ పనిచేశారు. ప్రముఖ సినీ హీరోయిన్ సింధు నటించిన బతుకమ్మ సినిమా(Bathukamma Cinema) కోసం ఆయన సంభాషణలు కూడా రాశారు.

  • 2014లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అందుకొనుటకు ప్రతిపాదించింది.
  • కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ ప్ర‌దానం చేసింది.
  • అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోక కవి అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో సన్మానించారు.
  • వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం (2015 ఆగస్టు 14) ప్ర‌దానం.
  • డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015 జూలై 5)
  • 2006లో నంది పురస్కారం అందుకున్నారు.
  • సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం , సుందరయ్య విజ్ఞాన కేంద్రం, 2022 అక్టోబరు 15
  • వంశీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న‌ల్ వారిచే దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం-2024
  • లోక్ నాయక్ పురస్కారం ప్ర‌దానం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం లోక్ నాయక్ ఫౌండేషన్ వారు అంద‌జేశారు. పురస్కారం తో పాటు రెండు లక్షల నగదు బహుమతులు ప్రదానం చేస్తారు.

Leave a Reply