Anantapur | పోలీసుల ఎదుటే దారుణహత్య
- కదిరిలో కలకలం…
- స్టేషన్ ముందే నరికి చంపిన దుండగులు
Anantapur | సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ (Police Station) ముందే దారుణహత్య జరగడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కళ్లముందే దుండగులు ఓ వ్యక్తిని నరికి చంపడం జిల్లావ్యాప్తంగా కలవరం సృష్టించింది.
తనకల్లు మండలానికి చెందిన ఈశ్వర ప్రసాద్ (42) అనే వ్యక్తిని ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్ ఎదుటే హత్య చేసినట్లు పోలీసులు (Police) తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… ఈశ్వర ప్రసాద్‌పై దుండగులు అకస్మాత్తుగా దాడి చేసి కత్తులతో నరికి హత్య చేశారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీస్ స్టేషన్ సమీపంలోనే పోలీసులు ఉండటం గమనార్హం. అయినప్పటికీ క్షణాల్లోనే దుండగులు దాడికి పాల్పడి పరారయ్యేందుకు ప్రయత్నించారు.

వివాహేతర సంబంధం.. అనుమానమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, కుటుంబ (family) విభేదాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన ప్రధాన నిందితులుగా హరి, చెన్నప్పలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల స్వాధీనం, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి (Hospital) తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుటే ఇలాంటి ఘోర ఘటన జరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

