సంగారెడ్డిలో ప్రజాస్వామ్యానికి అవమానం

సంగారెడ్డిలో ప్రజాస్వామ్యానికి అవమానం
జగ్గారెడ్డి పై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శలు
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడం తన జన్మహక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిని అదుపులో పెట్టడంలో అధికార వ్యవస్థ పూర్తిగా విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రంగా ఆరోపించారు. సంగారెడ్డిలో పోలింగ్ సందర్భంగా పోలీసులు, ఎన్నికల సిబ్బంది, ఓటు వేయడానికి వచ్చిన సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన జగ్గారెడ్డి ప్రవర్తన అత్యంత బాధాకరమని అన్నారు. ఆయన తీరు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ సంఘటనతో ప్రజలు తీవ్రంగా ఆవేదనకు గురయ్యారని తెలిపారు.
ఎన్నికల విధుల కోసం వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందిపై నోటితో చెప్పలేని విధంగా దుర్భాషలాడటం, వారిపై దాడికి దిగేలా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు. వెంటనే జగ్గారెడ్డి పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
చిన్న చిన్న కేసులు ఉన్న గ్రామస్థాయి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు స్టేషన్లకు తీసుకెళ్లి బైండోవర్ చేస్తున్నారని, ప్రచారానికి వెళ్లవద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రతి ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తూ వస్తున్న జగ్గారెడ్డిని మాత్రం ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
పోలీసులు, అధికార యంత్రాంగం జగ్గారెడ్డి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే దాని వల్ల కలిగే నష్టాన్ని గుర్తించాలన్నారు. జగ్గారెడ్డి ఈ విధంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదని, ప్రతి ఎన్నికల సమయంలో ఇదే తీరు కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పుడు అధికారంతో మరింత హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు శాంతి కాములు కానీ జగ్గారెడ్డి లాంటి వ్యక్తి వల్ల జిల్లా పరువు ప్రతిష్టలకు మచ్చ పడుతోందన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలా ఒక్క వ్యక్తి ప్రవర్తన వల్ల మొత్తం ప్రాంతానికి చెడ్డపేరు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
ఎన్నికల విధుల కోసం వచ్చిన అధికారులకు జరిగిన అవమానం దురదృష్టకరమని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అసౌకర్యం కలగడం తనను ఎంతో కలచివేసిందని తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈ ఘటనతో అసౌకర్యానికి గురైన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు తెలుపుతున్నట్లు చింతా ప్రభాకర్ పేర్కొన్నారు.
