ప్రణయ్‌ హత్య కేసు తీర్పుపై స్పందించిన అమృత

నల్గొండ మిర్యాలగూడలో 2018లో చోటుచేసుకున్న ప్రణయ్‌ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్‌ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ2 నిందితుడు శుభాష్‌ శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు.

అప్పట్లో ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారం రేపింది. కాగా.. ప్రణయ్‌ హత్య కేసులో తీర్పుపై అమృత స్పందించారు.

సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 10-03-2025 తేదీని లవ్‌ సింబల్‌తో పోస్ట్‌ చేసింది. అంతేకాకుండా.. ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌ ప్రణయ్‌’ అని రాసి పోస్ట్‌ చేసింది.

ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందని తెలిపింది. ఇప్పటినుంచైనా ఈ పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నానని, ఈ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన పోలీస్‌ శాఖ, న్యాయవాదులు, మీడియాకు ధన్యవాదాలని పేర్కొంది. తన బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీడియా ముందుకు రావట్లేదని ఆమె తెలిపింది. దయచేసి తమను అర్థం చేసుకోవాలని అమృత అభ్యర్ధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *