టెక్సాస్ – అమెరికాను పెను తుపాను వణికిస్తోంది! పెద్దఎత్తున టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. దుమ్ముధూళితో కూడిన బలమైన గాలులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీని కారణంగా పలు రాష్ట్రాల్లో 100కుపైగా కార్చిచ్చులు చెలరేగాయి. ఇప్పటికే 26 మంది మరణించగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్క మిస్సోరీలోనే ఇప్పటివరకు పది మంది మృతి చెందారు.
టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని అమరిల్లో కౌంటీలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆర్కన్సాస్‌లోనూ ముగ్గురు చనిపోగా.. 29 మందికి గాయాలయ్యాయి.మిస్సోరీలో టోర్నడోలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో స్థానికంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి.
అలబామా, కెంటకీ, మిసిసిపీ, టెనసీ, ఇల్లినోయీ, ఇండియానా, టెక్సాస్, టెన్నెసీ రాష్ట్రాలకూ టోర్నడోల ముప్పు పొంచి ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కెనడా సరిహద్దు నుంచి టెక్సాస్ వరకు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా.
ఓక్లహోమా, మిస్సోరీ, న్యూ మెక్సికో, టెక్సాస్, కాన్సస్‌లలో కార్చిచ్చులు చెలరేగడంతో ఆయా ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని నివాసితులను ఆదేశించింది. మరోవైపు.. మిన్నెసొటా, సౌత్ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని, అయితే.. ఈసారి విస్తృతి, తీవ్రత అధికంగా ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం నిపుణుడు బిల్ బంటింగ్ చెప్పారు.