America Cruelty | అమెరికా వీసాకు పత్తికొండ బిడ్డ బ‌లి Andhra Prabha Insight Story

America Cruelty | అమెరికా వీసాకు పత్తికొండ బిడ్డ బ‌లి Andhra Prabha Insight Story

హెచ్–1బి వీసా ద్రోహం.
8 ఏళ్ల పోరాటం.. త‌ప్ప‌ని నిరాశ
గుండెపోటుతో ఆకస్మిక మృతి.
ప‌త్తికొండ‌లో తీర‌ని విషాదం
మృతదేహం త‌ర‌లింపే మ‌హా క‌ష్టం
మృతదేహ తరలింపునకు నిధుల సేకరణ
విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి
తల్లిదండ్రులకు హెచ్చరికగా నిలిచిన ఘటన

( కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ) .

  America Cruelty

కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చెందిన దొంతిరెడ్డి శశికాంత్ రెడ్డి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లి అక్కడే స్థిరపడాలని కలలు క‌న్నాడు. కానీ అత‌డి క‌ల‌కు క‌ల్ల‌లు మారాయి. జీవితం విషాదాంతమైంది. హెచ్–1బి వీసా రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, చివరకు గుండెపోటుతో కన్నుమూసిన ఈ ఘటన ప్రవాస భారతీయుల్లోనే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆవేదనలో ముంచేసింది.

America Cruelty | ఎనిమిదేళ్ల అమెరికా జీవితం

శశికాంత్ రెడ్డి 2018లో మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్లారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలన్న ఆశతో అహర్నిశలు శ్రమించారు. అయితే అమెరికాలో ఉద్యోగ భవిష్యత్తుకు కీలకమైన హెచ్–1బి వీసా లాటరీలో పేరు రాకపోవడంతో ఆయన అనిశ్చితిలో పడిపోయారు. ఒకసారి మాస్టర్స్ పూర్తి చేసినప్పటికీ, వీసా అవకాశాల కోసం రెండోసారి మరో మాస్టర్స్ కోర్సులో చేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎనిమిదేళ్ల పాటు విదేశీ నేలపై కష్టపడి పనిచేసినా, వీసా నిబంధనలు, అదృష్టం కలిసిరాకపోవడం ఆయనను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. అధిక పని గంటలు, నిద్రలేమి, భవిష్యత్తుపై భయం – ఇవన్నీ కలిసి ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు స్నేహితులు చెబుతున్నారు.

America Cruelty | గుండెపోటుతో ఆకస్మిక మృతి

ఫిబ్రవరి 16న అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శశికాంత్ అక్కడికక్కడే కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. వైద్యులు ఇది కార్డియాక్ అరెస్ట్ కారణంగా సంభవించిన మృతి అని నిర్ధారించారు. చిన్న వయసులోనే ఇలాంటి ఘటన జరగడం కుటుంబ సభ్యులను, స్నేహితులను షాక్‌కు గురిచేసింది. కొడుకు ఎప్పుడెప్పుడు స్వదేశానికి వస్తాడా అని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఇప్పుడు ఆయన భౌతిక కాయం మాత్రమే చేరబోతోందన్న విషయం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది.

America Cruelty మృతదేహ త‌ర‌లింపున‌కు నిధుల సేకరణ

శశికాంత్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారీ వ్యయం కావడంతో, అమెరికాలోని తెలుగు సంఘాలు ‘గో ఫండ్ మీ’ వేదిక ద్వారా నిధులు సేకరిస్తున్నాయి. ప్రవాసులు, స్నేహితులు, బంధువులు సహాయ హస్తం అందిస్తున్నారు. త్వరలోనే మృతదేహాన్ని కర్నూలు జిల్లాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

America Cruelty | ఇది ఒక హెచ్చరిక

శశికాంత్ మరణం కేవలం ఒక కుటుంబానికి చెందిన విషాదం మాత్రమే కాదు; ఇది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న వేలాది మంది తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి అద్దం పడుతోంది. హెచ్–1బి వీసా రాకపోతే తిరిగి స్వదేశానికి రావడానికి ఇష్టపడక, మళ్లీ మళ్లీ కోర్సుల్లో చేరడం వల్ల విద్యార్థులు ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైద్య నిపుణుల ప్రకారం, నిరంతర ఒత్తిడి, నిద్రలేమి, అనిశ్చితి కారణంగా యువతలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. గతంలో కూడా వీసా సమస్యల కారణంగా ఆత్మహత్యలు, ఆకస్మిక మరణాలు సంభవించిన ఘటనలు ఉన్నాయి.

America Cruelty | తల్లిదండ్రులకు క‌నువిప్పు కావాలి

అమెరికా వెళ్తేనే జీవితం సాఫీగా సాగుతుందన్న భావన సమాజంలో బలపడుతోంది. డాలర్లే విజయానికి ప్రమాణమని భావించే దృక్పథం పిల్లలపై అదనపు ఒత్తిడిని పెంచుతోంది. విదేశీ విద్య ఒక అవకాశం మాత్రమే కానీ, అది జీవితం కాదనే విషయాన్ని కుటుంబాలు గుర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. శశికాంత్ రెడ్డి దురంతం సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. కెరీర్ కంటే ప్రాణం ముఖ్యమని, ఒత్తిడిని పంచుకునే వాతావరణం అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Leave a Reply