వెలగపూడి – దేశంలో ఉగ్రవాదాన్ని ఉపక్షించేది లేదని, ప్రధాని మోదీకి తామంతా అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్బంగా ప్రసంగిస్తూ.. పాక్ ఉగ్రవాదంపై మండిపడ్డారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఆనాడే మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని మోదీతో.. రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభిస్తున్నామని, అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని… రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని, రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్‌ను తుడిచిపెట్టేసింది. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు. అమరావతి రైతుల త్యాగాలు మరిచిపోలేనివి. ఉద్యమంలో అమరావతి మహిళా రైతుల పాత్ర కీలకం. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు.
రాజధాని రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. గత ప్రభుత్వం దివిసీమ ఉప్పెనలా అమరావతిని తుడిచి వేసిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల త్యాగాలను మర్చిపోలేమని చెప్పారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తాము బాధ్యులుగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. రాజధానిని అద్భుతంగా నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఎన్డీయే కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
రాళ్లు, రప్పల్లో మహానగరాన్ని చూసిన వ్యక్తి చంద్రబాబు అని పవన్ చెప్పారు. సైబరాబాద్‌ను చంద్రబాబు ఎలా సృష్టించారో.. అమరావతిని కూడా అలాగే అభివృద్ధి చేస్తారని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఎంతో విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని కితాబిచ్చారు. ఎంతో దూరదృష్టితో హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు… ఇప్పుడు అమరావతికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దూసుకుపోతుందని, అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు.
దేశంలో ఉగ్రదాడి అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో కూడా.. ప్రధాని మోదీ మన కోసం అమరావతికి వచ్చారని, ఇదే ఏపీపై మోదీ నిబద్ధతకు ఇదే నిదర్శనం అన్నారు. పహల్గామ్ దుర్ఘటనలో 27 మంది మరణించారని… ఈ సమయంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ అమరావతి కోసం ఇక్కడకు రావడం అమరావతిపై ఆయనకున్న ఇష్టానికి నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రజల తరపున నమస్కారాలు తెలియచేశారు. ప్రధాని మోదీకి ఆ కనకదుర్గమ్మ మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు ప్రసాదించాలని పవన్ దేవతామూర్తిని ప్రార్థించారు.