వెలగపూడి – రాజధాని అమరావతికి ప్రయాణించేవారికి శుభవార్త. ఇకపై విజయవాడ నగరంలోకి ప్రవేశించి, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన అవసరం లేదు. కృష్ణా నదిపై నిర్మించిన 3.11 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వారధి ద్వారా విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా, అతి తక్కువ సమయంలో నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
ప్రధానమంత్రి పర్యటన, అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం నేపథ్యంలో ఈ వంతెనను అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పశ్చిమ బైపాస్‌లో భాగంగా నిర్మించిన ఈ బ్రిడ్జి, అమరావతికి అత్యంత వేగవంతమైన అనుసంధానతను అందిస్తుంది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవారు గొల్లపూడి వద్ద ఈ వంతెన ఎక్కితే కేవలం ఐదు నిమిషాల్లోనే కృష్ణా నదిని దాటి అమరావతిలోని వెంకటపాలెం చేరుకోవచ్చు. అదేవిధంగా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు గన్నవరం సమీపంలోని చిన్న అవుటపల్లి వద్ద బైపాస్ ఎక్కి, విజయవాడ ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా అరగంటలోపే అమరావతిలోకి ప్రవేశించే వీలు కలిగింది.
ఈ వంతెన నిర్మాణం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవ్వడంతో పాటు, అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన భారీ వాహనాలు, నిర్మాణ సామగ్రి రవాణా కూడా సులభతరం కానుంది. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, వేగంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఇరువైపులా వేర్వేరు మార్గాలు, సూచికలు, డివైడర్లు, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కొత్త మార్గం అమరావతి అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలోని సచివాలయం, హైకోర్టు, ఇతర కార్యాలయాలకు వెళ్లే వారికి ఈ వంతెన ఓ వరంలా మారనుంది.
అమరావతికి రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నప్రజలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న జనంతో విజయవాడ పశ్చిమ బైపాస్ మార్గం కిటకిటలాడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బస్సులు, కార్లలో సభా స్థలికి చేరుకుంటున్నారు.
కృష్ణా జిల్లా చిన్నవుటపల్లి నుంచి రాజధాని గ్రామాలను కలిపేలా నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్, సుదూర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే ప్రజలకు ప్రధాన మార్గంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలివస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఐదేళ్ల విరామం తర్వాత రాజధాని పనులు మళ్లీ ప్రారంభం కావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు వెస్ట్ బైపాస్‌పై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి తాగునీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. లక్షలాది మంది ప్రజలు ఈ మార్గం గుండా ప్రయాణించే అవకాశం ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వచ్చిన పలువురు మాట్లాడుతూ, అమరావతి పనులు తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. “మా నాయకుడు చంద్రబాబు పిలుపు మేరకు, ప్రధాని మోదీ గారికి స్వాగతం పలకడానికి, అమరావతి నిర్మాణానికి మద్దతు తెలియజేయడానికి వచ్చాం. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండటం అత్యవసరం. ఈ ప్రభుత్వ హయాంలో, కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని నమ్మకం ఉంది,” అని వారు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో రాజధాని విషయంలో అనిశ్చితి నెలకొందని, ఇప్పుడు స్పష్టత రావడంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకున్న అమరావతి పనులు, మళ్లీ ఆయన సమక్షంలోనే పునఃప్రారంభం కానుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. వేలాది వాహనాలతో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. అమరావతికి తరలివస్తున్న జన ప్రవాహం కొనసాగుతూనే ఉంది.