(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ఏఐ టెక్నాలజీని వినియోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గత ఏడాది డ్రోన్లలను ఈ ఉత్సవాల సందర్భంగా వినియోగించిన అధికారులు మంచి సత్ఫలితాలు వచ్చాయి.
ఉత్సవాల సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల అవసరాలకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ను కీలకంగా మార్చనున్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ నుండి 11 రోజులపాటు నిర్వహించే దసరా మహోత్సవాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన విజయవాడలో ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఉత్సవాలకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యాల కోసం తీసుకుంటున్న చర్యలు దసరా మహోత్సవాలలో రద్దీ నియంత్రణ క్యూలైన్లలో నిర్వహణ సాంకేతిక వినియోగంపై సుదీర్ఘంగా మంత్రి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారంగా భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు మంత్రికి పూర్తిస్థాయిలో వివరించారు.
ఉత్సవాల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను కీలకంగా మార్చి, తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణలలో అనుసరిస్తున్న విధానం తరహాలోనే అదేవిధంగా ఇక్కడ కూడా అమలు చేసేందుకు ప్రయత్నించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు భక్తులకు సరైన సమాచారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తారని అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. స్త్రీ శక్తి పథకం అమలులోకి వచ్చినందున ఈసారి మహిళ భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని, వీరితో పాటు పెద్ద స్థాయిలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలన్నారు.
మరి ముఖ్యంగా ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమన్న ఆయన అధికారులు సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ కీలకంగా ఉంటుందని సూచించారు. దేవస్థానం సిబ్బందికి అన్ని పనులు అయినా అవగాహన ఉండాలని, ఈనెల 15వ తేదీల్లోగా ఉత్సవాలకు సంబంధించి అన్ని పనులు యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ ఉత్సవాలలో స్వచ్ఛంద సేవకుల పాత్ర ముఖ్యంగా ఉంటుందని వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఉత్సవాలకు సంబంధించి దేవాదాయ శాఖ నుండి కావలసిన అన్ని అనుమతులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నట్లు దావాదయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమీక్ష సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ దేవస్థానం ఈవో ఇతర ఉన్నతాధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
