వీధి వీరంగం ఫలితం
ఖాతాలో హత్యాయత్నం కేసులు
ఎస్సీ ఎస్టీ కేసు బోనస్
8 మందికి అరదండలు

(శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ) : కొడితే కొట్టాలిరా.. మందు కొట్టాలి. పండగేదైనా మందు కొట్టాలి. వీధుల్లో తకథిం..తకథిం వీరంగం తొక్కాలి. అలుపు చిన్నా.. సొలుపూ కన్నా.. జనంపైనే విరుచుపడాలి. ఊరంతా గగ్గోలు పెట్టాలి. కొడితే కొట్టాలిరా మందు కొట్టాలి.. అంటూ వినాయక చవితి పండుగ వేళ ..శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) కదిరి పట్టణం (Kadiri town) పరిధిలోని కుటాగుళ్ళ కుర్రోళ్లు రెచ్చిపోయారు. గ్యాంగ్ వార్ (Gang War) సృష్టించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి వెళ్లి.. వైద్యం చేస్తున్న డాక్టరమ్మకూ బూతులు వడ్డించారు. చుక్కలు చూపించారు. ఫలితంగా తలకెక్కిన నిషా దిగిన తర్వాత 8 మంది జైలుకు వెళ్లారు. వినాయక చవితి(Vinayaka Chavithi)కి వీధి వినోదం పంచిన ఈ రెండు గ్యాంగుల కథ తెలుసుకుందాం.

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణం పరిధిలోని కుటాగుళ్ళ పులివెందుల (Pulivendula) క్రాస్ లో వినాయక చవితి పందిరి వెలసింది. బుధవారం సాయంత్రం వరకూ వైభవంగా పూజలు జరిగాయి. మండపంలో విద్యుత్ దీపాల (Electric Lamps) వెలుగులు జిలుగులు, డీజే (DJ) దడ దడ.. అంతే యువకుల ఉత్సాహం కట్టలు తెగింది యువకులు మద్యం సేవించి, మద్యం మత్తులో తేలిపోయారు. ఇదే సమయంలో కదిరి పట్టణం సమీపంలోని కుటాగుళ్ల గ్రామం ఎస్టీ కాలనీ కుర్రోళ్లు పులివెందుల క్రాస్ లోని బెల్ట్ షాపునకు వెళ్లారు. అక్కడ లిక్కర్ బాటిల్స్ కొన్నారు. అక్కడే మందుతాగుతున్న అనిల్ కుమార్ ఈ ఎస్టీ కాలనీ కుర్రాళ్లను కెలికాడు. ఇంకేముందీ మాటా మాట పెరిగింది. పరస్పరం బాహాబాహీ కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో అనిల్ కుమార్ గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు.

ఈ గొడవలో గాయపడిన ఎస్టీ కాలనీ కుర్రోళ్లూ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ మళ్లీ గొడవ జరిగింది. ఇక అనిల్ కుమార్ తన మిత్రులకు ఫోన్ చేయగా పదిమంది పైగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఎస్టీ కాలనీ కుర్రోళ్లపై దాడికి దిగారు. ఈ ఘర్షణ ను ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. కానీ మద్య మత్తులోని అనిల్ కుమార్ గ్యాంగ్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆసుపత్రిలోని వస్తువులను చిందర వందర చేసి, నానా హంగామా చేశారు. డ్యూటీ డాక్టర్ రిషిత రెడ్డి ని దుర్భాషలాడారు. డాక్టర్ ను సైతం గాయపర్చారు. ఆసుపత్రిలో తాగుబోతుల వీరంగం సమాచారంతో పట్టణ సీఐ నారాయణరెడ్డి ఘటన స్థలికి చేరుకున్నారు.

డాక్టర్ రిషిత రెడ్డి ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్, సాయి గణేష్, రేకె రాజశేఖర్, కణంపల్లి భరత్, కార్తీక్, మణికంఠ, అశోక్ సహా కొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు . ఎస్టీ కాలనీకి యువకులు గిరి నాయక్, చంపలా నాయక్, రెడ్డప్ప నాయక్, ప్రదీప్ నాయక్ మద్యం మత్తులో తనపై దాడి చేశారని అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్టీ కాలనీ యువకుల పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక ఎస్టీ కాలనీ యువకుల ఫిర్యాదుతో అనిల్ కుమార్ గ్యాంగ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. మొత్తానికి మూడు హత్యాయత్నం కేసుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply