న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : బోర్డర్ ఏరియాల్లో మిస్సైల్స్, షెల్స్‌తో సాధారణ ప్రజలపై విరుచుకుపడుతున్న పాకిస్థాన్‌కు భారత్ దీటుగా జవాబిచ్చింది. గురువారం ఉదయం మరోసారి భారత వైమానికి దళం ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా అటాక్ చేసినట్టు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో లాహోర్ లోని HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్టు చెప్పారు. వాటిని పాకిస్థాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది. అలాగే సరిహద్దు వెంబడి మోహరించిన పాక్ గగనతల రక్షణ వ్యవస్థను పేల్చివేసింది. ఈ దాడులను భాతర గగనతలం నుంచే జరిపినట్లు వైమానిక దళం అధికారులు వెల్లడించారు.
భారత్‌లోని 15 నగరాలపై పాక్ మిస్సైల్స్ ప్రయోగం..
అంతకుముందు భారత్ లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నించింది.. గత అర్ధరాత్రి నుంచి భారత్ పైకి మిసైల్స్‌ను ప్రయోగించింది. అయితే .. భారత్ 400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని సమర్థంగా అడ్డుకుంది. మధ్యలోనే వాటన్నింటిని కూల్చి వేసింది. వాటి శిధిలాలు కొన్ని పాకిస్తాన్‌లో పడగా మరికొన్ని భారత్ సరిహద్దులలో పడ్డాయి. చైనాకు చెందిన బీవీఆర్ మిసైల్స్‌తో జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్ కోట్, బటిండా, లుథియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు పాక్ యత్నించిందని ఆర్మీ వెల్లడించింది. అయితే.. వాటన్నింటికి కూల్చవేశామని తెలిపింది.