బేకరీల్లో కల్తీ స్వీట్లు..

  • వినియోగదారుల ఆరోగ్యంతో స్వీట్‌ హౌస్‌ల చెలగాటం

ఆసిఫాబాద్‌, (ఆంధ్రప్రభ): కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని పలు స్వీట్‌ హౌజ్‌లు, బేకరీలు, హోటళ్లలో కల్తీ పదార్థాలతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. స్వీట్‌ హౌజ్‌లలో.. కాలం చెల్లిన మిఠాయిలను నిర్భయంగా అమ్ముతున్నారు. వీటి వినియోగంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు.

తాజాగా పట్టణంలోని మహాలక్ష్మి స్వీట్‌ హౌజ్ లో చెడిపోయిన మిఠాయి విక్రయించిన ఘటన కలకలం రేపింది. రెండు రోజుల క్రితం షఫీ అనే వ్యక్తి కొనుగోలు చేసిన మిఠాయి తిన్న పిల్లలు వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వినియోగదారులు స్వీట్‌ హౌజ్‌ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే దుకాణంలో చెడిపోయిన కేక్‌లు కూడా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రజా, యువజన సంఘాల నాయకులు అధికారులు తక్షణమే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, కల్తీ మిఠాయిలు విక్రయిస్తున్న దుకాణాలు, హోటల్లు, బేకరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌ మహేష్‌ స్పందిస్తూ… కాలం చెల్లిన మిఠాయిల నమూనాలు సేకరించామని, ల్యాబ్‌ రిపోర్టులు వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్తీ లేదా చెడిపోయిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Leave a Reply