ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ సంయుక్త దాడులు
తిరుపతి: టెంపుల్ సిటీ పవిత్రతను దెబ్బతీసేలా తిరుపతిలో కల్తీ ఆహారం విక్రయాలు భక్తుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. వేలాది మంది భక్తులు తిరుమల దర్శనానికి ముందు తిరుపతిలో ఆగి కాస్త సేదతీరి.. భోజనం చేసి బయలుదేరుతుంటారు. కానీ కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్లు మాత్రం మురికితో నిండిన వాతావరణంలో, నాసిరకం పదార్థాలతో వంటకాలను వడ్డిస్తున్నాయి.
ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ శాఖలు రెండు రోజుల పాటు సంయుక్త దాడులు జరిపాయి. 20 టీమ్స్‌గా విభజించి తొలి రోజు 30కి పైగా హోటల్స్, రెస్టారెంట్స్‌ను తనిఖీ చేశారు. ఈ సోదాల్లో కుళ్లిపోయిన, బూజు పట్టిన మాంసం, ముందురోజు తయారైన బిర్యానీ, కోడిగుడ్లు, అలాగే పాన్‌షాపుల్లో 3–4 రోజుల క్రితం తయారైన కిళ్లీలు గుర్తించి సీజ్ చేశారు.
రెండవ రోజు బేకరీలు, స్వీట్ స్టాల్స్, తయారీ కేంద్రాలపై దాడులు జరిగాయి. రేణిగుంటలోని FB ఫుడ్స్, క్యూటీ ఫ్రూటీ పరిశ్రమల్లో లైసెన్సులు లేకుండా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు బయటపడింది. ప్రమాదకర రంగులు, రసాయనాల వాడకం, అపరిశుభ్ర తయారీ వాతావరణం, అలాగే ప్యాకింగ్‌లో అక్రమాలు కూడా గుర్తించారు.
అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి, అనుమతులు లేని తయారీ కేంద్రాలను సీజ్ చేశారు. భక్తుల ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక నగర పవిత్రతను కాపాడటానికి కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.