విచరాణ వాయిదా..

  • రేప‌టి నోటిఫికేష‌న్ పై తీవ్ర ఉత్కంఠ‌

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో జరుగుతున్న విచారణ రేపటికి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జరిగిన విచారణ అనంతరం.. ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అన్ని పిటిషన్లను కలిపి ఫైన‌ల్ హియ‌రింగ్ లో వింటామ‌ని హైకోర్టు తెలిపింది.

నోటిఫికేషన్‌పై తీవ్ర ఉత్కంఠ

మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కావాల్సి ఉంది. అయితే, కోర్టు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో, రేపటి నోటిఫికేషన్ విడుదలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని పిటిషనర్లు కోరినప్పటికీ, కోర్టు అందుకు అంగీకరించలేదు.

50 శాతం రిజర్వేషన్ల పరిమితి..

ప్రస్తుతం, బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం, ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతం మించడానికి అవకాశం లేదు.

అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, రిజర్వేషన్లు 67 శాతానికి పెరిగాయి. ఈ జీవోలో బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ మొత్తం రిజర్వేషన్ల శాతం 67%గా ఉంది. ఒకవేళ హైకోర్టు ఈ జీవోను కొట్టివేస్తే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈ కారణంగానే, రేపు వెలువడే హైకోర్టు తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Leave a Reply