Adilabad | అంగన్వాడీల వేతనాలకు చట్టబద్ధత కల్పించాలి…

Adilabad | అంగన్వాడీల వేతనాలకు చట్టబద్ధత కల్పించాలి…
Adilabad | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కు దేశవ్యాప్తంగా గౌరవంతో కూడిన సమాన వేతనం అందించి, న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్(Workers, Helpers) (సిఐటియు) జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు డిమాండ్ చేశారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల ఐదవ రాష్ట్ర మహాసభలు ప్రారంభం కాగా పట్టణంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆర్ అండ్ బి(R&B) ప్రాంగణంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి సింధు, సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎం .సాయిబాబ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏఆర్ సింధు మాట్లాడుతూ.. పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంతో పౌష్టికాహారం(Nutrition) అందిస్తూ పనిచేస్తున్న అంగన్వాడి వర్కర్లకు, హెల్పర్లకు ప్రభుత్వాలు మొక్కుబడి వేతనాలు అందిస్తూ శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని విమర్శించారు.
ఇకపై అంగన్వాడీలు యాచించడం మాని హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పాలకులు అంగన్వాడీల బలోపేతం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు ప్రకటిస్తున్నా ఆచరణలో అమలు కావడంలేదని సింధు అన్నారు. దేశవ్యాప్తంగా ఒకే గొడుగు కింద అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం అందించి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు.
సీఐటీయు జాతీయ కోశాధికారి సాయిబాబా మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల సవతి తల్లి ప్రేమ ఉలకం వస్తూ అబద్దాలతో ప్రచారం సాగించుకుంటున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ముందుండి పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలు ఆమోదించారు. రాష్ట్ర మహాసభల్లో అంగన్వాడీ యూనియన్(Anganwadi Union) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ. జయలక్ష్మి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశ్రీ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, రాష్ట్ర కోశాధికారి మంగ, టి ఏ జి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోసం సచిన్, బండి దత్తాత్రి, లంక రాఘవులు, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
