రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు…

దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో భారీగా ప్రయాణికుల రద్దీ కనిపించడం సహజం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే ట్రైన్లలో ఈ సమయంలో ఎప్పుడూ రద్దీ ఉంటుంది.

పండుగల సీజన్‌ వచ్చిందంటేనే టికెట్‌ రిజర్వేషన్ కౌంటర్లు, IRCTC వెబ్‌సైట్‌లలో సీట్ల కోసం పోటీ ముందుగానే ప్రారంభమవుతుంది. జనరల్‌ బోగీల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో, చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్‌ టికెట్లపైనే ఆధారపడాల్సి వస్తుంది.

కానీ ఈ సారి కూడా పెద్ద సంఖ్యలో రైళ్లలో సీట్లు కొన్ని వారాల ముందుగానే ఫుల్‌ అయిపోయాయి. కొన్నింటిలో వెయిటింగ్ లిస్ట్‌ వందల సంఖ్యలో ఉండటం వల్ల సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

పండుగ సీజన్‌లో పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ప‌లు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అదనంగా, ఈ టికెట్లు IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో , రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయని, ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు.

ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలు…

చర్లపల్లి నుండి దానాపూర్‌కు (07419) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శనివారం నడవనుంది. అదే మార్గంలో తిరిగి దానాపూర్‌ నుండి చర్లపల్లి (07420) వరకు ప్రత్యేక రైలు సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 1 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తుంది.

చర్లపల్లి నుండి బర్హంపూర్ (07027) రైలు సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. తిరిగి బర్హంపూర్ నుండి చర్లపల్లి (07028) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.

అదే విధంగా, చర్లపల్లి నుండి శాలిమార్ (07225) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి సోమవారం నడవనుంది. శాలిమార్‌ నుండి చర్లపల్లి (07226) రైలు సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది.

సికింద్రాబాద్ నుండి మైసూర్ జంక్షన్ (07033) రైలు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రతి సోమవారం, శుక్రవారం నడుస్తుంది. తిరిగి మైసూర్‌ జంక్షన్ నుండి సికింద్రాబాద్ (07034) రైలు సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 1 వరకు ప్రతి మంగళవారం, శనివారం సర్వీస్ అందిస్తుంది.

పండుగ రద్దీకి అదనపు చర్యలు..

ఇంతటితో ఆగకుండా, దసరా, దీపావళి పండుగలలో రద్దీ మరింత పెరగవచ్చని అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే, 2025 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మొత్తం 170 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనుంది. అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు ఈ రైళ్లు వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంటాయి.

పండుగల సమయంలో ఎక్కువగా తమ స్వగ్రామాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు ఈ సర్వీసులు మరింత ఉపశమనం కలిగిస్తాయని అధికారులు తెలిపారు.

Leave a Reply