CM Revanth: అనర్హులకు పథకాలు అందితే.. అధికారులపై చర్యలు
రాష్ట్రంలో రేపటి నుంచి నాలుగు కొత్త పథకాలు అమల్లోకి వస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఆయన బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను రేపటి నుంచి ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
ఒక్క హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని మండలాల పరిధిలో ఒక్కో గ్రామాన్ని నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాలు సమర్ధవంతంగా అమలు అయ్యేలా చూడాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఏమాత్రం అన్యాయం జరగొద్దని, అనర్హులైన వారికి లబ్ధి చేకూర్చితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.