విశాఖపట్నం ( ఆంధ్రప్రభ బ్యూరో), మార్చి 4: ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కమిటీ, ఐ.ఆర్.సి.టీ.సి. సంస్థలు 2025వ సంవత్సరం నవరత్న హోదాను సాధించడం అభినందనీయమని రైల్వేస్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ అన్నారు. గత 2014-2024 సంవత్సరాల మధ్య భారత రైల్వే శాఖకు చెందిన ఐదు అనుబంధ సంస్థలు ఈ నవరత్న హోదాను పొందాయని, 2025వ సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కమిటీ, ఐ.ఆర్.సి.టీ.సి. సంస్థలు నవరత్న హోదాను సాధించడం గర్వించదగ్గ అంశమని, డాక్టర్ సీఎం రమేష్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్’ పథకం కింద అభివృద్ధి చేపట్టి, రైల్వే స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మార్చి, అత్యాధునిక హంగులతో కొత్తగా తీర్చిదిద్దుతున్నదనే విషయం తెలిసిందేనని, దేశంలో బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలో పట్టాలెక్కుతుందని, భారతీయ రైల్వే సంస్థ గణనీయమైన పురోగతి సాధిస్తుందని ఎంపీ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఐ.ఆర్.సి.టీ.సి. వంటి సంస్థల వార్షిక టర్నోవర్ ను వేల కోట్లకు తీసుకువెళ్లిన ఘనత, భారతీయ రైల్వే వ్యవస్థను బలోపేతం చేశారనడానికి ఈ నవరత్న హోదా నిదర్శనమని రమేష్ అన్నారు.
నవరత్న హోదాను సాధించడం ద్వారా రైల్వే అనుబంధ సంస్థలు బలోపేతం కావడమేగాక, దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణీకులకు ఉపయోగపడేలా వేగవంతమైన నిర్ణయాలను తీసుకోవడం, ఆర్థికపరమైన స్వయం ప్రతిపత్తి ఈ సంస్థలకు లభిస్తాయని రమేష్ తెలిపారు. భారతీయ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు, రైల్వే శాఖ అనుబంధ సంస్థల అధికారులకు, ఉద్యోగులకు ఈ సందర్భంగా సీఎం రమేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.