Highway |హైవేపై యాక్సిడెంట్‌

హైవేపై యాక్సిడెంట్‌

  • మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు
  • బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి
  • బ‌స్సులో ప్ర‌యాణికులు సేఫ్‌

Highway | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా శిరివెళ్ళ మెట్ట వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు అక్కడికక్కడే మృతి చెందగా.. మ‌రొక‌రిని చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, సిరివెళ్ల సీఐ దస్తగిరి బాబు, ఎస్‌ఐ చిన్న పీరయ్యలు ప్ర‌మాద‌ స్థలానికి చేరుకొని పరిశీలించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. శ్రీవారి ట్రావెల్స్‌కు చెందిన ప్రయివేటు బస్సు (పి వై 01 డి ఈ 5799) హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా సిరివెళ్ల మెట్ట వద్ద మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఆ బైక్ బ‌స్సు టైర్ కిందికి వెళ్ల‌డంతో సుమారు 100 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లింది. అలాగే కొద్దిదూరం బైక్‌ను ఈడ్చుకెళ్లి ఉంటే కర్నూలు దగ్గర జ‌రిగిన ప్ర‌మాదం పున‌రావృత‌మ‌య్యేది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును సడన్‌గా ఆపేయ‌డంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. యాక్సిడెంట్‌లో బైక్‌పై ఉన్న చెన్నయ్య (30), చిన్న సుబ్బరాయుడు (50) మృతి చెందారు. బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.

సిరివెళ్ల మెట్టపై ఉన్న హోటల్స్ వద్ద టీ తాగి రోడ్డు దాటుతుండగా బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టినట్టు తెలిపారు. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, హెచ్చరిక బోర్డులు–లైటింగ్ లోపాలే ప్రమాదానికి కారణమని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైవే అధికారుల నిర్లక్ష్యంతో సంఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా అందుబాటులో లేదు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply