మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి తీవ్రమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ తాజాగా షాకిచ్చారు. నిన్న రాత్రి (బుధవారం) తన ఇంటి వద్ద చోటు చేసుకున్న ‘హై డ్రామా’ పరిణామాల నేపథ్యంలో, ఈ రోజు (గురువారం) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు.

సురేఖ మినహా మిగిలిన మంత్రులందరూ కేబినెట్ భేటీకి హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన ఈ సమావేశం, సురేఖ కోసం ఎదురుచూడటం వల్ల ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

పార్టీ పెద్దలకు సురేఖ ఫిర్యాదు..

కేబినెట్ భేటీకి దూరంగా ఉన్న మంత్రి కొండా సురేఖ, ఈ రోజు మధ్యాహ్నం తన కుమార్తెతో కలిసి పార్టీ పెద్దలను కలిశారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో, ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో ఆమె భేటీ అయ్యారు.

తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారంటూ.. ఈ పరిణామాల వల్ల తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని సురేఖ పార్టీ నాయకత్వానికి వివరించినట్లు సమాచారం. ఈ రాజకీయ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టిస్తున్నాయి.

అయితే, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని ఆమె కొండా సురేఖకు సూచించారు. కూర్చుని మాట్లాడుకుందాం అని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం.

Leave a Reply