నీర‌జ్ కు అరుదైన గౌర‌వం….

నీర‌జ్ కు అరుదైన గౌర‌వం….

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాకు భారత సైన్యం అరుదైన గౌరవం కల్పించింది. దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నీరజ్ చోప్రాకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ (Honorary Lieutenant Colonel) హోదాను అందజేశారు. దేశానికి చేసిన విశిష్ట సేవలు, అలాగే క్రీడా రంగంలో నీరజ్ చోప్రా సాధించిన అత్యున్నత విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించారు. ఈ గౌరవ హోదా టెరిటోరియల్ ఆర్మీలో వర్తిస్తుంది. టెరిటోరియల్ ఆర్మీ అనేది సైన్యానికి మద్దతుగా, అత్యవసర సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాల వేళ కీలక పాత్ర పోషిస్తుంది.

హర్యానాలోని పానిపట్‌కు చెందిన నీరజ్ చోప్రా, 2016 లో నాయబ్ సుబేదార్గా సైన్యంలో చేరి, తన క్రీడా శిక్షణతో పాటు సైనిక విధులను సమన్వయం చేసుకున్నారు.
టోక్యో 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశ కీర్తిని ఇనుమడింపజేశారు. నీరజ్ చోప్రా కంటే ముందు క్రికెటర్ ఎం.ఎస్. ధోని, షూటర్ అభినవ్ బింద్రా వంటి ప్రముఖ క్రీడాకారులు కూడా గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను అందుకున్నారు. నీరజ్ కు లభించిన ఈ గౌరవం యువతకు సైన్యంలో చేరడానికి, క్రీడల్లో అత్యున్నత శిఖరాలను చేరుకోవడానికి గొప్ప స్ఫూర్తిగా నిలవనుంది. నీరజ్ భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని రక్షణ శాఖ, భారత సైన్యం ఆకాంక్షించాయి.

Leave a Reply