కొత్తవలస(విజయనగరం) ఆగస్టు 23 (ఆంధ్రప్రభ): విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని తమన్న మెరక గ్రామంలో జరిగిన నవ దంపతుల ఆత్మహత్య స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివాహమైన ఎనిమిది నెలలకే చిరంజీవి (30), వెంకటలక్ష్మి (28) లు విగత జీవులుగా కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేపాడ మండలం దుంగాడ గ్రామానికి చెందిన చిరంజీవికి, కొత్తవలస మండలంలోని జోడి మేరక గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి గత ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో శనివారం ఉదయం దంపతులు ఇద్దరూ తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకుని కనిపించారు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకరమైన సంఘటనతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. చిన్న వయసులోనే జీవితాన్ని ముగించుకోవడం అందరినీ కలచివేసింది.