TG | మరింత పకడ్బందీగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం..
- 25 శాతం సబ్సిడీ
- మార్చి 31 వరకు రెగ్యులరైజేషన్ అవకాశం
- ఎల్ ఆర్ ఎస్ పై మంత్రులు సమీక్ష
ఎల్‌ఆర్‌ఎస్ పథకం అమలును వేగవంతం చేసే కార్యక్రమంలో భాగంగా 25 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ ఆర్ ఎస్)పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు ఈరోజు సమీక్ష నిర్వహించారు.
కాగా, అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగేళ్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మార్చి 31 వరకు రెగ్యులరైజేషన్ అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పది శాతం ప్లాట్లు రిజిస్టరైన లేఔట్లలో మిగిలిన ప్లాట్లను కూడా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశమివ్వాలని నిర్ణయించింది. నిషేధిత జాబితాలోని భూములపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లింపులు చేసి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.