A. Konduru | అదుపులో సీకేడీ
- రోగుల సంఖ్య తగ్గింది
- ఎ.కొండూరులో నిరంతర ఆరోగ్య చర్యలు
- ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎం.సుహాసిని..
A. Konduru | ఏ కొండూరు, ఆంధ్రప్రభ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎ.కొండూరులో విస్తృత, నిరంతర ఆరోగ్య చర్యలు చేపడుతున్నామని.. రోగుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నామని, ఈ చర్యల కారణంగానే సీకేడీ వ్యాధి తీవ్రత తగ్గిందని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం. సుహాసిని తెలిపారు. గ్రామస్థాయిలోనే వ్యాధికి జీవనాధార చికిత్సలు అందుబాటులో ఉన్నాయని.. ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నాలుగు పడకల డయాలసిస్ కేంద్రం ద్వారా సేవలు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం ఇక్కడ 26 మంది రోగులు ఈ సేవలు పొందుతున్నారన్నారు.
విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే రోగులు ఇక్కడ సేవలు పొందుతున్నారన్నారు. ప్రతి డయాలసిస్ రోగికి ప్రభుత్వం ద్వారా నెలకు రూ. 10 వేల ఆర్థిక సహాయం అందుతోందన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సమగ్ర వైద్య పర్యవేక్షణ అందించేందుకు నెఫ్రాలజిస్ట్ ఓపీ సేవలను విస్తరించినట్లు తెలిపారు. ఈ సేవల ద్వారా రోగులకు నేరుగా నిపుణుల సలహాలు, చికిత్స మార్గదర్శకాలు, మందుల సర్దుబాటు, అవసరమైన సూచనలు అందుతున్నాయని.. దీనివల్ల వ్యాధి తీవ్రతను తొలిదశలోనే గుర్తించి నియంత్రించే అవకాశం పెరిగిందన్నారు.
..నిరంతర పర్యవేక్షణ..
జిల్లా కలెక్టర్ మార్గ నిర్దేశనంతో ఎ.కొండూరు ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు సమన్వయ శాఖల అధికారుల బృందాలు నిరంతర పర్యవేక్షణలో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు. మొదటి సర్వేలో 242 కేసులను గుర్తించగా.. ఇటీవలి సర్వే నాటికి ఈ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. నిరంతర మందుల వినియోగం, జీవనశైలి మార్పులు, వైద్య పర్యవేక్షణ వల్ల కొందరు రోగులు పూర్తిగా కోలుకోగా, మరికొందరిలో వ్యాధి తీవ్రత తగ్గిందని వివరించారు.
డయాలిసిస్ అవసరమైన రోగుల సంఖ్య స్థిరంగా ఉండటం చికిత్సల ప్రభావం ఇచ్చిన ఫలితాలకు నిదర్శనమన్నారు. మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు, పోషక సప్లిమెంట్లు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు నిర్వహిస్తూ రోగుల ఆరోగ్య స్థితిని సమగ్రంగా పరిశీలిస్తుమన్నారు.
…కంటికి రెప్పలా.. చేయూత ఇలా….
డయాలిసిస్, ఇతర చికిత్సల కోసం రోగులకు ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులో ఉందని,సంక్లిష్ట స్థితిలో ఉన్న రోగులను వారానికి రెండుసార్లు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నాం అని ఈ విధంగా రిఫరల్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అని జిల్లా వైద్య శాఖ అధికారిని సుహాసిని తెలిపారు. తండాల్లో ట్యాంకుల ద్వారా క్రమం తప్పకుండా శుభ్రమైన తాగునీటిని అందిస్తున్నాం ఏమి, తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచి ప్రజలకు సురక్షితమైన నీటిని అందించే చర్యలు అందుబాటులో ఉన్నాయన్నారు.
సామాజిక భద్రతలో భాగంగా డయాలిసిస్‌పై ఉన్న రోగులకు ప్రతి నెలా క్రమంతప్పకుండా ఆర్థిక సహాయం అందించబడుతోందని, సురక్షిత తాగునీటి వినియోగం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో సర్వేలు నిర్వహిస్తున్నాం అని, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వేలు చేస్తున్నాం అని,వైద్య విద్యాసంస్థల నిపుణుల ద్వారా సర్వే ఫలితాలను విశ్లేషిస్తున్నాం అన్నారు. ఎ.కొండూరులో కిడ్నీ వ్యాధి విస్తరించకుండా, వ్యాధి ఉన్న రోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని.. వదంతులు నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

