గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో గ‌ట్టి షాక్…

బెంగళూరు : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) గట్టి షాక్ ఇచ్చింది. ఆమెపై రూ.102.55 కోట్ల జరిమానా విధిస్తూ, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రన్యారావుతో పాటు మరో ముగ్గురు నిందితులకు కలిపి సుమారు రూ.270 కోట్ల పెనాల్టీ వేసినట్లు అధికారులు తెలిపారు. జరిమానా చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం రన్యా రావు సహా నిందితులు బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. అక్కడికే అధికారులు వెళ్లి, 2,500 పేజీలతో కూడిన నోటీసులు అందజేశారు.

బంగారం స్మగ్లింగ్‌లో పట్టుబడిన రన్యా రావు

గత మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యా రావు పట్టుబడ్డారు. ఆమె దుబాయ్ నుంచి తిరిగి వ‌స్తుండ‌గా, అధికారులు ఆమె లగేజీలో 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటన తర్వాత ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రన్యా రావు ఎవరోకాదు, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ కె.రామచంద్రరావు కుమార్తె. ఈ పరిణామంతో వివాదం మరింత ముదిరింది. కేసు వెలుగులోకి రాగానే రామచంద్రరావును ఉన్నతాధికారులు సెలవుపై పంపడం గమనార్హం.

దర్యాప్తులో సంచలన వివరాలు వెలుగులోకి..

దర్యాప్తులో రన్యా రావు గత రెండేళ్లలో (2023–2025) 52 సార్లు దుబాయ్‌కి వెళ్ళినట్లు బయటపడింది. అంతేకాకుండా, కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవడానికి ఆమె పోలీస్ ఎస్కార్ట్‌ను వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. రన్యా రావు ఇంటిపై సోదాల్లో 2 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల నగదు స్వాధీనం అయ్యాయి.

Leave a Reply