- కలెక్టర్ ఆదేశాలు..
నారాయణపేట ప్రతినిధి, (ఆంధ్రప్రభ ) : జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలు పై వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, హార్టికల్చర్, మత్స్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయా రంగాల ఉత్పాదకతను పెంచే దిశగా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. అన్ని పారామిటర్లను కలిగిన పూర్తి డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో పథకం అమలును పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఐఏఎస్ అధికారి రానున్నారని కలెక్టర్ తెలిపారు. ఆ అధికారి సమీక్షకు ముందే ప్రతి శాఖ తమ విభాగానికి సంబంధించిన పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, అధికారులు సాయిబాబా, జాన్ సుధాకర్, రహమాన్, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

