ముందుకు సాగని పడవ

  • తెడ్డు సాయంతో ఒడ్డుకు చేర్చిన మానవత్వం


చింతూరు, (ఏఎస్ఆర్ జిల్లా), (ఆంధ్రప్రభ) : ఏఎస్ఆర్ జిల్లా (ASR District) లోని చింతూరు మన్యంలో వరదల నేపధ్యంలో పండుగ రోజు సైతం ఆదివాసీల కన్నీళ్ల పర్యంతం. గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె భౌతిక కాయాన్ని ఇంటికి చేర్చి.. ఊరిలో జనం మధ్య అంత్యక్రియలు జరపాలని ఆ కుటుంబం పడిన బాధ వర్ణనాతీతం. గిరిజన గ్రామాలను వరద చుట్టుముట్టితే.. ఊళ్లోకి వెళ్లటానికి కాలి దారిలేక .. ఆ వరద దాటేందుకు ఆ కుటుంబం పడవదారిలో పడరాని పాట్లు పడింది. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చింతూరు ఐటీడీఏ పరిధిలోని వీఆర్ పురం (VR Puram) మండలం రామవరం గ్రామ పంచాయతీలోని చొప్పల్లి గ్రామానికి చెందిన పొన్నాడ నారాయణమ్మ (47) గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు పొందుతోంది. ఈ క్రమంలో బుధవారం పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది.

దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిందేకు పడరాని పాట్లు పడ్డారు. వరద పోటుతో ఏజెన్సీ విలవిల్లాడుతున్న తరుణంలో.. వీఆర్ పురం మీదుగా దారులన్నీ వరద నీటిలో మునగటంతో. దిక్కుదోచని స్థితిలో చింతూరు మీదుగా తరలించటానికి ప్రయత్నించారు. చింతూరులోని చీకటి వాగు వద్దకు చేరుకున్నారు. చింతూరు ఐటీడీఏ పీవో (Chintur ITDA PO) అత్యవసర సమయాల్లో, వైద్య సేవలకు ప్రజలను సోకిలేరు వాగు దాటించేందుకు సోకిలేరు వద్ద చింతూరు గ్రామానికి చెంది ఎర్రం శ్రీను నాటు పడవను ఏర్పాటు చేశారు. బుధవారం ఎక్కువ ట్రిపులు వేయటంతో పడవ ఇంజన్ మొరాయించింది. ఇంజన్ గేర్లు రివర్స్ తిరుగటంతో ముందుకు వెళ్లని స్థితి ఏర్పడింది. ఈ తరుణంలోనే చొప్పల్లి గ్రామానికి చెందిన పొన్నాడా నారాయణమ్మ మృతదేహం దాటించాల్సి వచ్చింది. ఇక తెడ్డు సాయంతో ఆమె మృతదేహాన్ని పండుగ రోజు కూడా పడరాని పాట్లు పడుతూ ముకునూరు ఒడ్డుకి చేర్చి శ్రీను, సాయి, నాగరాజు మానవత్వాన్ని చాటుకున్నారు.

Leave a Reply