Naveen Polishetty | అదే నమ్మకంతో వస్తున్నాం..

Naveen Polishetty | అదే నమ్మకంతో వస్తున్నాం..
Naveen Polishetty | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అసలు సిసలైన పండుగ సినిమాగా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, (Naga Vamsi) సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ ఈ మూవీని సమర్పిస్తోంది.
నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం (Music) అందించారు. సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి జనవరి 14న థియేటర్లలో అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
Naveen Polishetty | ఆంధ్ర టు తెలంగాణ..
మిక్కీ జె మేయర్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న అనగనగా ఒక రాజు చిత్రం నుంచి మూడవ గీతంగా ఆంధ్ర టు తెలంగాణను ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఆవిష్కరించడం విశేషం. ఇప్పటికే విడుదలైన భీమవరం బాల్మా, రాజు గారి పెళ్ళిరో పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. విన్న వెంటనే శ్రోతల మనసు దోచుకుంటున్న ఈ మూడో గీతం ఆంధ్ర టు తెలంగాణ (Telangana) కూడా వాటి సరసన చేరుతుంది అనడంలో సందేహం లేదు. ఈ ప్రత్యేక గీతానికి మిక్కీ జె మేయర్ ఉత్సాహభరితమైన సంగీతాన్ని అందించారు.
ఆంధ్ర టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నేను రానా అంటూ చంద్రబోస్ అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఉంది. గాయనీ గాయకులు సమీరా భరద్వాజ్, ధనుంజయ్ సీపాన కూడా అంతే ఉత్సాహంగా ఆలపించి, పాటకు మరింత జోష్ (Josh) తీసుకొచ్చారు. యువత కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర బృందం సందడి చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు అతిథులుగా విచ్చేశారు.

Naveen Polishetty | అదే నమ్మకంతో..
స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. జాతిరత్నాలు ప్రీ రిలీజ్ (Pre Release) వేడుక కూడా ఈ వరంగల్ ప్రాంతంలోనే జరిగింది. ఇప్పుడు అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ వేడుక ఇక్కడ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సమయంలో మాకు షోలు కూడా దొరకని పరిస్థితి. పది షోలు మాత్రమే ఇస్తామన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాని మీరు మౌత్ టాక్ తో పెద్ద హిట్ చేశారు. నా ప్రతి సినిమాకి ప్రేక్షకులే మార్కెటింగ్ చేస్తుంటారు. నా సినిమాని భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
మీ ప్రేమ, మీ అభిమానం, మీరు నాకు అందించిన మూడు విజయాలు.. నాలో ఎంతో ఎనర్జీని నింపాయి. ఆ ఎనర్జీకి రెట్టింపు వినోదాన్ని మీకు అందించాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే అనగనగా ఒక రాజు కథ రాయడం జరిగింది. టీంలో ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి, వాటిని హిట్ (Hit) చేశారో.. అదే నమ్మకంతో అనగనగా ఒక రాజుకి టికెట్స్ బుక్ చేసుకోండి. ఆలస్యమైనా కానీ మంచి సినిమా అందించాలనేదే మా ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలోనే ఈ అనగనగా ఒక రాజు సినిమా వస్తుంది.

Naveen Polishetty | మా రెండేళ్ల ప్రయాణం..
మేము ఇప్పటికే సినిమాని చాలాసార్లు చూసుకున్నాం. అలాగే చిత్ర బృందంలో భాగంకాని కొందరికి ప్రత్యేక షోలు వేసి సినిమా చూపించాం. వారు సినిమా చూస్తున్నంతసేపూ కడుపుబ్బా నవ్వుతూనే ఉన్నారు. అలాగే భావోద్వేగ సన్నివేశాలు చూసి హత్తుకున్నారు. సినిమా అయిపోగానే అందరూ నిల్చొని చప్పట్లు కొట్టారు. ఇలాంటి స్పందన చూసి మాకు చాలా సంతోషం కలిగింది. అనగనగా ఒక రాజు సినిమా (Movie) అనేది మా రెండేళ్ల ప్రయాణం. మా టీంతో సంబంధం లేని వ్యక్తులు.. సినిమా చూసి అంతగా ఎంజాయ్ చేశారంటే.. పండగకు మీరందరూ కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో మా సినిమాకి వచ్చి రచ్చ రచ్చ చేయండి. నా సినిమాల్లో మీరు కోరుకునే ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుంది. అలాగే అందమైన ఎమోషనల్ డ్రామా కూడా ఇందులో ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ చూస్తూ మా టీం అంతా కంటతడి పెట్టుకున్నాం.
Naveen Polishetty | నా చివరి శ్వాస వరకు..
మీరు టికెట్ బుక్ చేసుకొని జనవరి 14న థియేటర్ కి రండి.. మీ అందరికీ పండగ సినిమా అందించే బాధ్యత మాది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇక్కడివరకు ఎలా వచ్చావని అందరూ నన్ను అడుగుతుంటారు. నాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. నాకు బ్యాక్ గ్రౌండ్ గా ఎన్నో ఫ్యామిలీలు (Family) ఉన్నాయి. నా చివరి శ్వాస వరకు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మా గురువు గారు చిరంజీవి గారు పండగకు థియేటర్లలో ఒక ఎనర్జీని సెట్ చేసేశారు. ‘అనగనగా ఒక రాజు’తో మేము ఆ ఎనర్జీని కొనసాగించబోతున్నాం. నాకు ఇష్టమైన హీరోలు చిరంజీవి గారు, రవితేజ గారు, ప్రభాస్ గారి సినిమాలతో పాటు నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది అన్నారు.
Naveen Polishetty | మీలాగే నేను కూడా..
కథానాయిక మీనాక్షి చౌదరి (Meenakshi Choudary) మాట్లాడుతూ.. గత సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నేను పోషించిన మీను పాత్రను మీరు ఎంతగానో ప్రేమించారు. అలాగే ఈ సంక్రాంతికి మీరు చారులత పాత్ర పై ప్రేమను కురిపిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరిలాగే నేను కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సితార సంస్థ నాకు కుటుంబం లాంటిది. ఈ బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు మారి గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడిగా పరిచయమవుతున్న ఆయన.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.
డీఓపీ యవరాజు గారి డెడికేషన్ కి హ్యాట్సాఫ్. రైటర్, క్రియేటివ్ డైరెక్టర్ (Director) చిన్మయి గారికి థాంక్స్. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్. నవీన్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయనలో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. సినిమా పట్ల నవీన్ గారికి ఉన్న తపన, సినిమా కోసం ఆయన పడే కష్టం అసాధారణమైనది. మిక్కీ జె మేయర్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. జనవరి 14న విడుదలవుతున్న మా ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని మీ కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. హాయిగా నవ్వుకుంటూ.. సంక్రాంతి పండుగను జరుపుకోండి అన్నారు.

