Durgamma | సాక్షిగా నిర్ల‌క్ష్యం

Durgamma | సాక్షిగా నిర్ల‌క్ష్యం

  • శ్రీచక్ర పూజకు సిద్ధం చేసిన పాలు పాడవ్వడంపై విచారణ
  • అధికారుల నిర్లక్ష్యంపై ఈఓ సీరియ‌స్‌
  • సిబ్బందిపై కఠిన చర్యలు
  • అధికారులకు షోకాజ్ నోటీసులు

Durgamma | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన శ్రీచక్ర నవావర్ణార్చన పూజ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటన పై ఆలయ అధికారులు చర్యలు ప్రారంభించారు.

శ్రీ నవ చక్రర్చన పూజలో వినియోగించేందుకు సిద్ధం చేసిన పాలు పాడైపోయినట్లు వెలుగులోకి రావడం, వెంటనే కార్యనిర్వాహణాధికారి తక్షణమే స్పందించారు. స్థానాచార్యులతో కలిసి నియమించిన కమిటీ ద్వారా సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో పూజా కార్యక్రమాల నిర్వహణలో పర్యవేక్షణ లోపం, విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా బయటపడినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Durgamma

భక్తుల మనోభావాలు, ఆలయ ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై క్రమశిక్షణాత్మక చర్యలను కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్ ప్రారంభించారు. శ్రీచక్ర నవావర్ణార్చన నిర్వహించిన అర్చకులు డీఎస్ఎస్ సుబ్రహ్మణ్య శర్మను బాధ్యుడిని చేస్తూ అక్కడ నుంచి ఆయనను విధుల నుంచి తొలగించారు. ప్రత్యామ్నాయంగా మరో అర్చకునికి శ్రీచక్ర నవవర్ణార్చన బాధ్యతలు అప్పగించారు.

అలాగే పూజా విభాగం, స్టోర్స్ విభాగాలకు చెందిన పలువురు సిబ్బందికి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారి విధుల మార్పు చేస్తూ, వివరణ కోరారు. పూజా ద్రవ్యాల నాణ్యతను ముందస్తుగా పరిశీలించడంలో విఫలమైనందుకు ప్రొవిజన్ స్టోర్స్ విభాగం సిబ్బందిపై సంజాయిషీ కోరుతూ ఏడురోజుల గడువు ఇచ్చారు.

పూజా కార్యక్రమాల సమన్వయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు నోటీసులు జారీ చేసి, నిర్ణీత కాలవ్యవధిలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సందర్భంలో శ్రీచక్ర పూజ నిర్వహించిన ప్రాంతానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను సకాలంలో అందజేయని కారణంగా ఇంజినీరింగ్ విభాగం అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

సదరు పాలు పూజలో వినియోగించకుండా, అదే రోజు ప్రత్యామ్నాయంగా ఆవు పాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజను కొనసాగించినట్లు ఈఓ చెప్పారు. పూజా కార్యక్రమాల్లో ఎలాంటి అపచారం జరగలేదని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ, బాధ్యతాయుత చర్యలు తీసుకుంటామని, భక్తుల మనోభావాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్ తేల్చిచెప్పారు.

Leave a Reply