ఎవరి మంచిచెడులకు వారే కారణం!

మన మనసుకున్న శక్తితో మనను మనమే ఉద్ధరించుకోవాలి. అంతే తప్ప నాశనం చేసుకోకూడదు. మన మనసే మనకు చుట్టం. అదే మనకు శత్రువు కూడా అవుతుందంటుంది భగవద్గీత. అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే.. తల్లిదండ్రులైనా, గురువులైనా, శ్రేయోభిలాషులైనా మన మంచి కోరి మంచి మాటలు చెబుతారు. మిత్రులుగా పక్కనుంటూ మన చెడు కోరుకునేవారు.. చెడ్డ దారులు పట్టిస్తారు. మంచి మాటలు వినాలా? చెడుమార్గంలో సాగాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మనమే. మన ఇంద్రియాలు తరచుగా మనల్ని తప్పు దోవల్లోకి లాక్కుపోతాయి. వాటికి లొంగిపోయామా.. పతనం తప్పదు. వాటిని మన అదుపులో పెట్టుకుంటేనే మనం జయిస్తాం. ఇది జీవిత రహస్యం. విజయం సాధించడానికైనా, ఓడిపోవడానికైనా మూల కారణం మనమే. చాలా మంది తమ ఓటములకు, తాము జీవితంలో ఎదగకపోవడానికి ఇతరులే కారణమని చెబుతుంటారు. మరికొందరేమో.. పరిస్థితుల ప్రభావం అంటుంటారు. తరచిచూస్తే.. చాలా మంది విజేతల కుటుంబ పరిస్థితులు మన కంటే ప్రతికూలంగా ఉంటాయి. కానీ వారు ప్రతి దాన్నీ తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతి ఓటమిని, ప్రతికూల పరిస్థితులను కూడా సోపానాలుగా మార్చుకుంటారు. దీనికి కారణం వారికి ఉండే వివేక జ్ఞానం. ఈ ప్రపంచాన్ని ఒక్కసారి గమనించినట్లయితే ఎన్నో అద్భుతాలు గోచరిస్తాయి. అచేతనాలుగా పరిగణించబడే రాళ్లు, రప్పలు మొదలుకొని ప్రాణమున్న జీవుల్లో గొప్పవాడనిపించుకున్న మానవుడి దాకా అంతా ప్రపంచమే. రాళ్లు, రప్పలకు అసలు ప్రాణమే ఉండదు. పశుపక్ష్యాదులకు ప్రాణం, జ్ఞానం ఉన్నా.. ఆ జ్ఞానం వాసనా జ్ఞానమే కానీ, వివేకం ఉండదు. వివేకంతో కూడిన జ్ఞానం ఉండేది ఒక్క మనుషులకే. అంత గొప్ప సామర్థ్యం ఉన్న మనిషి ఎప్పుడూ నిరాశచెందకూడదు. చిన్నచిన్న వైఫల్యాలకు కుంగిపోకూడదు. ఆ వైఫల్యాలకు ఇతరులను పరిస్థితులను కారణంగా చూపకూడదు. ఈ ప్రపంచంలో మానవులుగా పుట్టినందుకు.. వివేకంతో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం. పంచభూతాలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎన్నో రకాల ప్రాణులు మన జీవనాన్ని సుఖమయం చేస్తున్నాయి. ఏక వ్యక్తిత్వమనే దృక్పథం నుండి ప్రపంచ వ్యక్తిత్వమనే పథంవైపు పయనం సాగించాలని మన సంస్కృతి మనకు చెబుతుంది. ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్న మనిషి స్వశక్తిని నమ్ముకుని మనసా, వాచా, కర్మణా కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఆధ్యాత్మిక ఉన్నతికైనా.. జీవితంలో పురోగతికైనా అదే ముఖ్యం.

  • కామిడి సతీష్‌ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *