వెలగపూడి : కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలులోకి వస్తుంది, ఎవరెవరికి స్కీమ్ వర్తిస్తుంద అనే దానిపై రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ శాసనసభలో నేడు తల్లికి వందనం పథకంపై మాట్లాడుతూ.. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఇంట్లో చదువుకునే బిడ్డలందిరికీ తల్లికి వందనం వర్తిస్తుందని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకంపై శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని చెప్పారు.
ఈ పథకానికి రూ.9407 కేటాయించాం…
బడ్జెట్లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించామన్నారు. గత ప్రభుత్వంలో వారు సంవత్సరానికి రూ.5,540 కోట్లు కేటాయించారని.. గతంతో పోలిస్తే ఇది 50 శాతం అధికమని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందుకు బాబు సూపర్ – 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని ఆనాడు చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. భారతదేశంలో రీప్లేస్ మెంట్ రేట్లో తమిళనాడు తర్వాత స్థానంలో ఏపీ ఉందన్నారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంత మంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి తేల్చిచెప్పారు.
అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదానా….జగన్ కు బిజెపి క్లాసు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కు 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదాకు పట్టుపట్టడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. నేటి సభలో జగన్కు ప్రతిపక్ష హోదాపై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడంలేదని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని.. ఈ క్రమంలో మనం కూడా జగన్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తే వాళ్లకు తెలుస్తుందని అన్నారు. దీనిపై చర్చ కూడా చేయాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు