ఆనందానికి మూలం

జీవితమంతా ఒకేలాంటి అనుభవాలతో ఎవరికీ సాగదు. తామొక్కరే బాధలు అనుభవిస్తున్నామన్ని లోకంలో మిగిలిన వారంతా ఆనందంతో, హుషారుగా జీవితం గడుపుతున్నారని అనుకోవటం అంటే జీవితాన్ని సరిగా అర్థం చేసుకోకపోవటమే. కొంతమంది నవ్వుతూ కబుర్లు చెపుతున్నారు కాబట్టి, వారి మనసులో ఎలాంటి కష్టాలు లేవనికాదు. ప్రతి ఒక్కరి ఏవో ఒక రకపు ఇబ్బందులు వుంటాయి. అవి మనసును పట్టిపీడిస్తున్నా వాటిని మరచిపోయి వాళ్ళు ఆనందంగా వెలుగురితో కలిసి తిరుగుతుంటారు. అది నటనకాదు, జీవితం ఏమిటో తెలుసు కుని ప్రవర్తించటమే. అందమైన అనుభవాలకు పొంగిపోవటం, ప్రతికూలభావాలకు కుంగిపోవటం రెండూ సరైనవి కాదు. ప్రశాంతంగా అనుభూతులను స్వీకరించటం నేర్చుకోవాలి.
ఆనందానికి మూలం జీవితాన్ని అర్థం చేసుకుని జీవించటం, ఈ సూత్రం తెలియని పెద్దలు తమ పిల్లల మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఏదీ జరిగినా మన మంచికే అనుకోవటం కాదు, ఏదైనా నావల్లనే అని కూడా అనుకోగలిగినప్పుడే జీవితంలో ఆనందం మిగులుతుంది. మనుషులు ఆనందంగా లేకపోవటానికి కారణాలు వారే.
వీరిలో మొదటిరకం వారు తమ మీద తమకు నమ్మకం లేనివారు. జీవితం అంతా ముందే నిర్ణయించబడి వుంటుంది. ఏదీ మనచేతిలో లేదు అనుకునే వీరు కష్టాలన్నీ తనకోసమే వున్నాయని కళ్ళ వెంట నీరు తెచ్చుకుంటారు.
ప్రయత్నం చేసి కష్టాలలోనుండి బయటకు వద్దామన్న కోరిక వుండనివారు మరో రకం. ఎప్పుడూ తప్పులు చేస్తూ, ఎవరో ఒకరిచేత తిట్లు తింటూ అదే లోకంగా వుంటారు. వీరు ఎదురు తిరగరు. తమది తప్పు కాదని ధైర్యంగా చెప్పరు. ఎటువంటి భావోద్వేగాలను కలిగివుండాలనేది ఎవరికి వారు ఎంచుకోవాల్సిందే. తమ తమ ఆలోచనలను ఎటువైపు మళ్ళింపచేస్తారు. వేటి మీద స్థిరంగా పుంచుతారనే దాన్నిబట్టి జీవితానుభవాలు మారతాయి.
ఆనందం ఒక క్షణంలో కలుగుతుంది. మరుక్షణంలో బాధ, ఆపైన విషాదం. ఇలా అన్నిరకాల అనుభవాలు జీవితకాలంలో అనుభవించాల్సిందే. మానవుల్లో ఒకేరకపు అనుభూతులు వున్నవారెవరూ వుండరు. కోపం, పగ ద్వేషం లాంటివి ప్రవర్తించే మనుసు కలవారు ఉంటారు. వాళ్ళు లేనిపోని అనారోగ్యాలు గురించి చెప్పుకుంటూ, అర్థం లేని కన్నీళ్ళు కారుస్తూ అందరి దృష్టీ తను మీదికి మళ్ళేలా చేస్తుంటారు. వ్యక్తిత్వలోపం మరికొందరిది. వారు ప్రశాంతంగా వుండలేదు. ఇతరులను ప్రశాంతంగా ఉండనివ్వరు. జీవితంలో ఎప్పుడూ ఘర్షణ వాతావరణం కోరుకుంటారు.
పిల్లలు పెద్దల ఒత్తిడికి తల ఒగ్గి అన్నింటినీ అంగీకరించి వారు చెక్కిన శిల్పంలా తయారవుతారు. కాని ఆనందంగా వుండరు. మంచి ఉద్యోగం చేయటము, చక్కని ఆదాయం, సౌకర్య వంతమైన ఇల్లు, విలాస సౌకర్యాలు వుంటే జీవితం ఆనందంగా గడిచిపోతుందన్న భావనతో ఒత్తిడి చేస్తారు. నిజానికి ఎదిగే పిల్లలకు అవసరమయినది తన మీద తనకు నమ్మకం. స్వతంత్రంగా ఆలోచించటం, నిర్ణయాలు తీసుకోవటం, తాము కోరుకున్న పద్ధతిలో ఎదగటంవంటివి నేర్పరు. తమ భావోద్వేగాల తృప్తికోసం మరెవరిమీదో ఆధారపడేలా చేస్తారు.
ఇతరులమీద ఆధారపడి తాను అనందం అందుకోవాలనుకునేవారికి ఎన్నటికీ ఆనందం దక్కడు. తాము ఎవరిమీద ఆధార పడివున్నారో వారు దూరంగా జరిగినా, శాశ్వతంగా దూరమైనా అశాంతి, అభద్రత పెరుగుతాయి. ఆనందం కోసం ఒకరిమీద ఆధారపడి వ్యక్తి ఎవరైనా సరే, వారు మరొకరికి ఆనందం అందించలేరు. మద్దతుగా నిలబడలేరు.
మానసిక స్థితి, భావోద్వేగ ప్రదర్శన మన చేతిలోనే వుంటుంది. మనసును నియంత్రించుకోవాలి. ఆ విషయం బాధ్యతాపూర్వకంగా అంగీకరించినప్పుడే జీవితంలో శాంతి ఏర్పడుతుంది. ప్రశాంత జీవనం అందు కుంటారు. కోరుకున్న జీవన అనుభవాలు దక్కుతాయి. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరికాదు. జీవితంలో సందిగ్ధత వుంటుంది. అనుకున్న విధంగా సాగదు. కష్టాలు, సుఖాలు రెండూ వుంటాయి.
తరతరాలుగా అందుకున్న అనుభవాలతో పేద్దలు ఏదీ శాశ్వతం కాదని చెప్పారు. ఆ విషయం అర్థం చేసుకోక తమ చేతికి చిక్కిన వన్నీ శాశ్వతం అనుకుని, ఆ భావనలో తేలిపోతూ ఒక్కసారిగా భంగపాటుకు గురవుతారు.
ప్రేమ శాశ్వతం కాదు. అయినా జీవితాన్ని చాలా అందంగా పుస్తకాలలో, సినిమాలలో చూపించి భ్రమలోకి నెడతారు. ఆ ప్రేమ, బంధం అశాశ్వతం అనేది తెలియటం, తెగిపోవటంతో అంతా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి. బాధ ఆనందం, మానసిక వ్యధ అన్నీ ప్రతిక్షణం మారటమే ప్రకృతి ధర్మం. ఋతువులు మారతాయి. మనుషులు మారతారు. సందర్భాలు భిన్నంగా ఎదురవుతాయి. మనోభావాలు మారిపోతాయి. ఇవన్నీ ఏక్షణంలో స్థిరంగా వుండకూడదన్నదే ప్రకృతి ధర్మం.
ఏదీ శాశ్వతంగా నిలవని ప్రకృతిలో బ్రతుకుతున్న మనం, మనిషికి సంబంధించినవి శాశ్వతంగా నిలవాలని కోరుకోవటం సబబుకాదు. అన్ని రకాల ఒడుదుడుకులు, మార్పులు గమనిస్తూ భావోద్వేగాలను, రాగద్వేషాలను మన మన:స్థితికి ప్రశాంతంగా మలుచుకుంటూ చేసిన ప్రయాణంలోనే ఆనందం వుంటుంది.

  • తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *