TG | హజెలో లాబరేటరీస్ పై చర్యలు తీసుకోవాలి…

TG | హజెలో లాబరేటరీస్ పై చర్యలు తీసుకోవాలి…

  • సీఎంఓ కు, పిసిబి మెంబర్ సెక్రటరీకి వినతులు

TG | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ సమీపంలో ఉన్న హజెలో లాబరేటరీస్ తదితర పరిశ్రమలు విపరీతంగా కాలుష్యం చేస్తూ తమ ఆరోగ్యాలను, భూగర్భ జలాలను, పంట భూములను కాలుష్యం చేస్తున్న దానిపై వెంటనే చర్యలు తీసుకొని తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతూ బాధిత రైతులు గుమ్మి దామోదర్ రెడ్డి, నరసింహ, లింగయ్య, తదితరులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పీసీబీ మెంబర్ సెక్రటరీకి వినతి పత్రాలను అందజేశారు. హజెలో లాబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ప్రతినిత్యం విపరీతమైన వాయు, జల కాలుష్యానికి పాల్పడుతుందని, ఈ కాలుష్యం కారణంగా తమ గ్రామ ప్రజలు చర్మ రోగాలు, కళ్ల మంట, తలనొప్పి, పునరుత్పత్తి సమస్యలతో పాటు ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, జన్యు సంబంధమైన దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు.

ఈ పరిశ్రమలోని కూలింగ్ టవర్స్ లో వివిధ సందర్భాలలో టీజీపీసీబీ అధికారులు సేకరించిన నమూనాల సిఓడి (కెమికల్ ఆక్సిజన్ డిమాండ్) విలువలు వరుసగా 1159, 2122, 4692, 14897 ఉన్నట్లుగా గుర్తించడం జరిగిం దని, అదేవిధంగా 2005 జూన్ 11వ తేదీన సీపీసీబీ రీజినల్ డైరెక్టరేట్ చెన్నై అధికారులు తనిఖీ చేసిన సమయంలో పరిశ్రమ సమీపంలో సేకరించిన గాలి నమూనాలో బెంజన్; టోలునే; ఏతేల్ బెంజన్; O-Xylene ; ఐసొప్రోపీల్ బెంజన్; 1,4 డిచ్ లోరో బెంజన్; 1,1 డిచ్ లోరో ఇతన్ వంటి విషపూరిత రసాయనాలు గుర్తించబడినాయి. ఈ విషయాన్ని గమనిస్తే పరిశ్రమ వారు విపరీతమైన వాయు కాలుష్యానికి పాల్పడుతున్నట్లుగా నిర్ధారణ కూడా అవుతున్నదన్నారు.

TG

పరిశ్రమ సమీపంలో/ పరిశ్రమ ఆవరణ లోపల వివిధ సందర్భాలలో టీజీపీసీబీ అధికారులు సేకరించిన స్టేజ్ఞాటెడ్ వాటర్ సిఓడి విలువ వరుసగా 183, 349, 361, 341, 359, 663 గా నమోదైంది. ఈ పరిశ్రమ వారు వదిలివేసిన పారిశ్రామిక వ్యర్థ జలాల కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైనాయి. సీపీసీబీ రీజినల్ డైరెక్టరేట్ చెన్నై అధికారుల నివేదిక ప్రకారం పరిశ్రమ సమీపంలోని వ్యవసాయ బోరుబావులలోని నీటిలో టీడీఎస్ విలువ 7622 నుండి 50393 వరకు చేరి అనేక రకాల విషపూరిత కెమికల్ కాంపౌండ్స్ గుర్తించబడినాయి. ఈ పరిశ్రమ చేసిన కాలుష్యం కారణంగా వ్యవసాయ బోరుబావులు పూర్తిగా నిరుపయోగంగా మారి, వ్యవసాయ భూములున్నాయి.

పరిశ్రమ సమీపంలోని కొంతమంది రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతూ, 5 కిలోమీటర్ల దూరంగా ఉన్నా పిల్లాయిపల్లి కాలువ ద్వారా వచ్చే మూసి నీటిని పైపులైన్ల ద్వారా తరలించి వ్యవసాయం చేస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిశ్రమ చేసే కాలుష్యం గురించి మా గ్రామస్తులం తరచుగా టీజీపీసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడమే కాకుండా, ఈ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ వాయువుల వాసనలను భరించలేక కాలుష్యాన్ని నియంత్రించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని పోన్ ద్వారా సంప్రదించిన గ్రామస్తులను, ఫోన్ చేసిన కారణాన్ని సాకుగా చూపుతూ దోపిడీదారులుగా, బ్లాక్ మెయిలర్లుగా పేర్కొంటూ పరిశ్రమ యాజమాన్యం వారు ఫిర్యాదుదారులపై బెదిరింపులకు పాల్పడుతుందని వారు అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అధికారుల నివేదికలను కూడా వినతి పత్రాలకు జత చేసినట్లుగా వారు తెలిపారు.

Leave a Reply