Police Administration | కృష్ణా జిల్లాపై నిఘా కన్ను

Police Administration | కృష్ణా జిల్లాపై నిఘా కన్ను
- అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం
- జిల్లా వ్యాప్తంగా పేకాట, కోడిపందాలపై దాడులు
- భారీగా నగదు పట్టుకుంటున్న పోలీసులు
- జిల్లా ఎస్పీ ఆదేశాలతో రాత్రి వేళలో గట్టి నిఘా
Police Administration | (ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో) : జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీసు (District Police) యంత్రాంగం రాత్రి వేళ ముమ్మర తనిఖీలు నిర్వహించటంతో పాటు కోడిపందేలు, పేకాట శిబిరాలపై దాడులు చేపట్టారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న క్రమంలో కోడిపందేల శిబిరాలు ఏర్పాటు చేయకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబరు 31, జనవరి 1వ తేదీన సైతం రాత్రి వేళల్లో గట్టి బందోబస్తును నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. నిఘా నేత్రాల పర్యవేక్షణలో అడుగడుగునా జిల్లాను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో పేకాట శిబిరంపై దాడి చేసి భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట శిబిరంలో 8మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.2.20 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం ఆశ్చర్యం. జిల్లా వ్యాప్తంగా కోడిపందేల బరులు నిర్వహిస్తారనే అనుమానం ఉన్న చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోడిపందేలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Police Administration | పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో డ్రోన్ తో నిఘా :
కృష్ణా జిల్లా వ్యాప్తంగా అసాంఘీక కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో నిఘా పెంచారు. ఎవరి కంట కనబడకుండా మారుమూల ప్రాంతాలు, పొలాల్లో జరుగుతున్న అసాంఘీక కార్యకలాపాలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. గుడివాడ తాలూకా, పెడన పోలీస్ స్టేషన్ల (Police Station) పరిధిలో డ్రోన్ల సాయంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డ్రోన్ విజువల్స్ ఆధారంగా పోలీసులు వెంటనే సంఘటనా ప్రదేశానికి చేరుకుని, పేకాట ఆడుతున్న వారిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడైనా పేకాట, కోడిపందేలు నిర్వహిస్తే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతీ కదలికపై నిఘా ఉంచుతున్నామని, ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ పనులకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

Police Administration | 100కు పైగా ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు :
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు యంత్రాంగం అత్యంత పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన కూడళ్లు, సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు (Inspections) చేపట్టారు. అతివేగాన్ని అరికట్టేందుకు కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే ప్రమాదాలను నివారించడానికి జిల్లా వ్యాపంగా 100కుపైగా ప్రదేశాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

Police Administration | భారీగా పేకాట, రోగిపందాల శిబిరాలపై దాడులు :
కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా పేకాట, కోడిపందేల శిబిరాలపై దాడులు చేశారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి కోడూరు మండలంలో ఎనిమిది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి రూ.2.20లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కూటమి పార్టీకి చెందిన నేత ఒకరు ఉన్నట్లు సమాచారం. జనవరి 1వ తేదీన నాగాయలంకలో కోడిపందేలు నిర్వహిస్తున్న 8మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4970లు, ఒక కోడిపుంజు (Chicken coop) స్వాధీనం చేసుకున్నారు. కృత్తివెన్నులో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.1700ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొవ్వ మండలం పెదముత్తేవి శివారు ప్రాంతంలో రహస్యంగా జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5560లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఉంగుటూరు మండలం ఇందుపల్లి శివారు ప్రాంతంలో రహస్యంగా జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.25.370ల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం గుడివాడ (Gudivada) తాలూక బిళ్లపాడు శివారు ప్రాంతంలో రహస్యంగా జూదం ఆడుతున్న 12మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.33,950లు నగదు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబరు 31వ తేదీన మచిలీపట్నం శివారు మూడు స్తంభాల సెంటర్ లో రహస్యంగా జూదం ఆడుతున్న 29మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కృత్తివెన్ను మండలంలో కోడి పుంజులను, చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 29వ తేదీన గుడ్లవల్లేరులో కోడికత్తులు కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద నుంచి 240 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
Police Administration | కోడిపందేలు నిర్వహించవద్దని ముందస్తు హెచ్చరికలు :
సంక్రాంతి ముసుగులో కోడిపందేలు, జూదక్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామంటూ కూచిపూడి ఎస్ఐ పి.శిరీష పేర్కొన్నారు. కూచిపూడి, పెదపూడి, కోసూరు గ్రామాల్లో గతంలో కోడిపందాలు (Cockfighting) నిర్వహించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కోడిపందాలు, గుండాట, పేకాట, జూదం, అశ్లీల నృత్యాలు తదితర అసాంఘీక కార్యకలాపాలు నిషేదించడమైనదని తెలిపారు. అతిక్రమించిన వ్యక్తులు, సంస్థలపైన చట్టపరమైన గేమింగ్ యాక్ట్, క్రిమినల్ యాక్ట్ ప్రకారం చర్యలు చేపడతామని ఎస్ఐ హెచ్చరించారు. ఉయ్యూరు మండలంలోని పలు ప్రాంతాల్లోనూ, కంకిపాడు మండలం గొడవర్రు గ్రామ పరిధిలో కోడిపందేలు నివారణకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలో ఏ విధమైన కోడిపందేలు, గుండాటలు, పేకాటలు నిర్వహించరాదని తెలిపారు. ఇటువంటి అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించే వారిపై, స్థలాలు కేటాయించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బ్యానర్లు ఏర్పాటు చేయటం జరిగింది.

