R&B Road | మలుపులు.. యమపురికి పిలుపులు

R&B Road | మలుపులు.. యమపురికి పిలుపులు
- రహదారిపై కనిపించని సూచిక బోర్డులు
- ప్రమాదాలు జరిగినా పట్టించుకోని అధికారులు
R&B Road | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఆర్ అండ్ బీ రహదారి మలుపుల వద్ద ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే కానీ అధికారులు స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి, బిజ్వార్, అవుసులోని పల్లి, గ్రామాల మధ్య రహదారిలో మలుపులు ప్రమాదకరంగా ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
బిజ్వార్ నుంచి పులిమామిడి వెళ్లే క్రమంలో వాహనదారులు రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు బీటీ రోడ్డు అధ్వానంగా ఉంది. దీంతో బైకులు, ఆటోలు, ఇతర వాహనాలు గుంతను తప్పించేందుకు కుడివైపుగా వాహనాలు తీసుకువస్తున్నారని.. అదే సమయంలో ఒక్కసారిగా ఎదురుగా ఏమైనా వాహనాలు వస్తే కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే సింగిల్ రోడ్డు అని పైగా రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో మలుపుల దగ్గర ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందన్నారు. తక్షణమే అధికారులు మలుపుల దగ్గర ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
